తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్ కుమార్ ఆదివారం కరీంనగర్లో ఖండించారు.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్ కుమార్ ఆదివారం కరీంనగర్లో ఖండించారు. ప్రాణహిత - చేవెళ్ల, మిడ్ మానేరు, తోటపల్లి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ పాలన హయాంలో ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని ఆ పార్టీ నేతలను టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఈ సదరు ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని ఆయన గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రస్తుతం వాటి కోసం ధర్నాలు చేయడమేంటని నిలదీశారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనలో జరిగిన పనులు వృధా కాకుండా కొనసాగింపుగా ఇది ఉంటుందన్నారు. అయితే, కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలను వినోద్ కొట్టిపడేశారు. గత రెండు దఫాల పాలనలో మిడ్ మానేరు ప్రాజెక్టు పనులు 30 శాతం లోపే కాగా, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 20 శాతం పనులు పూర్తి చేసినట్టు వినోద్ కుమార్ చెప్పారు.