బాబూ..రూ.50 కోట్లు ఏమయ్యాయి?
బాబూ..రూ.50 కోట్లు ఏమయ్యాయి?
Published Wed, Dec 21 2016 10:38 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
- ప్రజా విశ్వాసం కోల్పోయిన సీఎం
- గడపగడపకు వైఎస్‌ఆర్‌లో ఎంపీ బుట్టా రేణుక
ఆదోని/రూరల్: జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్న రూ.50 కోట్లు ఏమవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సూటిగా ప్రశ్నించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డితో కలిసి మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామంలో జరిగిన గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ చావిడి వద్ద ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. ఆ తరువాత మాట మార్చారని, పెద్దనోట్ల రద్దుపై కూడా స్వరం మార్చి.. ప్రజల్లో విశ్వాసం పోగొట్టుకున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో పేదలే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎంపీ నిధులు రూ.40లక్షలు మంజూరు చేశానని, గ్రామంలో పైప్‌లైన్ నిర్మాణానికి కూడా అవసరమైన నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు.
పథకాలన్నీ పచ్చచొక్కాలకేనా..?
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ పచ్చ చొక్కాలోళ్లకే చేరుతున్నాయని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీ వేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎవరైనా బాగుపడ్డారా అంటే ఒక్క మీనాక్షి నాయుడు కుటుంబం పేరు మాత్రమే చెబుతున్నారని దుయ్యబట్టారు. గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నియోజకవర్గం ఇన్‌చార్జి బుట్టా రంగయ్య కూడా మాట్లాడారు.
సమస్యల ఏకరువు..
అంతకు ముందు ఎంపీ, ఎమ్మెల్యే గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లారు. వైఎస్సార్సీపీ సంధించిన ప్రశ్నావళి కరపత్రాన్ని ప్రజలకు అందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో చంద్రబాబు ఎన్ని నెరవేర్చారో చదివి మార్కులు వేయాలని కోరారు. రెండున్నరేళ్లలో తమ గ్రామంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని గ్రామ ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యేతో తమ గోడును వెళ్లబోసుకున్నారు.కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు విశ్వనాథ్ గౌడ్, నారాయణ స్వామి, మండిగిరి సర్పంచ్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, శేషిరెడ్డి, పంపాపతి, దేవా, దేవదాసు, సురేంద్రరెడ్డి, కల్లుపోతుల సురేష్, మునిస్వామి, రెహ్మాన్, జిల్లా కార్యదర్శి రియాజ్ అహ్మద్, యువజన నాయకుడు వీరేంద్ర, ఫయాజ్ అహ్మద్, గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యురాలు ఉమ, గ్రామ నాయకులు నాగరాజు, రామ్మోహన్, ఉరుకుందప్ప తదితరులు పాల్గొన్నారు.
Advertisement