బద్వేలు టీడీపీలో రచ్చ రచ్చ
గోపవరం :బద్వేలు నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అధికారిక కార్యక్రమాలను ఇద్దరూ పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇద్దరు నేతలు కూడా బలనిరూపణకు వేదికగా జనచైతన్య యాత్రలను మార్చుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గోపవరం మండలంలో 14, 15వ తేదీల్లో జనచైతన్యయాత్ర షెడ్యూల్‌ను ఎమ్మెల్యే ప్రకటించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రెండు రోజుల ముందే తన అనుచరులతో మండలంలో కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ డ్వాక్రా సంఘాల రెండవ విడత రుణామాఫీ చెక్కుల కార్యక్రమాన్ని బద్వేలు మార్కెట్‌యార్డులో అధికారులు ఎమ్మెల్యే చేతులమీదుగా పంపిణీ చేయించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అదే ప్రజల సమక్షంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి తిరిగి రుణమాఫీ చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య అధికారులు నలిగిపోతున్నారు. ఒకానొక దశలో ఈ నియోజకవర్గాన్ని వదిలితే ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే చెప్పింది చేయాలా లేక మాజీ ఎమ్మెల్యే మాటవినాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా ఏ హోదాతో మాజీ ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎంత కాలం దళిత ప్రజాప్రతినిధులపై పెత్తనం చెలాయిస్తారని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరుపై ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు, పార్టీ పరిశీలకుల దృష్టికి కూడా తీసుకెళ్లానని, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.