
కడపకు వచ్చేందుకు కమిషనర్ విముఖత
ప్రజామన్నలు పొందిన సూర్యసాయి ప్రవీణ్‌చంద్ బదిలీ
శరవేగంగా చేపట్టిన కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే మాధవీరెడ్డి దుందుడుకు చర్యలే కారణం
అదే విషయం చర్చించుకుంటున్న అధికార యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కడప: కడప గడపలో సరికొత్త సంప్రదాయం కొనసాగుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో సాధింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. ప్రజాస్వామ్యం స్థానంలో నియంత పాలన నడుస్తోంది. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులకు ప్రజలంతా ఒక్కటే అన్న స్ఫూర్తిని విస్మరిస్తున్నారు. మీరు మాకు ఓటేశారా? మీరు ఫలానా పార్టీ కదా? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా కడపకు అధికారులు విధుల్లో చేరాలంటే వెనుకంజ వేస్తున్నారు. ఆమేరకు రెండు వారాలైనా కమిషనర్‌గా నియమితులైన తేజ్ భరత్ బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం.
⇒ కడప కమిషనర్‌గా సూర్యసాయి ప్రవీణ్‌చంద్ సమర్థవంత అధికారిగా తక్కువ కాలంలో గుర్తింపు పొందారు. అనంతరం తనదైన శైలిలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగర పాలకమండలిని సమన్వయం చేసుకుంటూ ప్రధాన సర్కిల్స్ విస్తరణ, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రహదారుల వృద్ధి, డ్రైనేజీ వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టేందుకు కృషి చేశారు. కాగా టీడీపీ సర్కార్ జూలై 20న అమరావతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్థానంలో ఐఏఎస్ అధికారి తేజ్ భరత్‌ను నియమించారు. రెండు వారాలు గడిచినా ఆయన బాధ్యతలు చేపట్టేలేదు.
నూతన కమిషనర్ విముఖత వ్యక్తం చేయడం వెనుక కడప నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రాతినిథ్యంలో పాలకమండలి ఉండడం ఒకే ఒక్క కార్పోరేటర్ మాత్రమే టీడీపీ పరిమితం కావడం, పైగా స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డి దుందుడుకు చర్యలు వెనుకంజకు ప్రధాన కారణంగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ప్రొటోకాల్‌కు విరుద్ధ నిర్ణయాలు ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న ఆయన కడపకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అదే విషయాన్ని సహచర సన్నిహితులతో వెల్లడించినట్లు తెలుస్తోంది.
అధికారుల్లో విస్మయం
ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్ష చర్యలతో అనతికాలంలోనే కడప నగరంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాల్లో అనవసర జోక్యమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ప్రథమ పౌరుడు అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యులే అన్న స్పృహ అసలే లేదు. ఈపరిస్థితులను పరిశీలిస్తున్న అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష చర్యలతో ఎంతోకాలం మనుగడ సాధించలేమని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు.
కమిషనర్‌గా విధుల్లో చేరేందుకు తేజ్ భరత్ విముఖత వ్యక్తం చేయడంపై స్థానికంగా అధికారులు సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ విముఖత విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఆర్డీఓ ఒకర్ని సంప్రదించినట్లు సమాచారం. తొలుత సుమఖత చూపిన ఆర్డీఓ విషయాలు తెలుసుకున్న తర్వాత వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమిషనర్ అన్వేషణలో టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం.