
జనగామలో బాహుబలి విగ్రహం!
జనగామ: వరంగల్ జిల్లా జనగామలోని మహంకాళి ఆలయంలో బాహుబలి(వర్ధమాన మహావీరుడు) విగ్రహాన్ని పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి బుధవారం వెలుగులోకి తీసుకువచ్చారు. వర్థమాన మహావీరుడి చరిత్రను ప్రజలకు తెలియజెప్పేందుకు రత్నాకర్‌రెడ్డి తన పరిశోధనలను కొనసాగిస్తున్నారు. మహంకాళి ఆలయ ప్రాంగణంలో పదిహేను అంగుళాల పొడవు..నాలుగు పలకల రాతి స్తంభంపై నాలుగు వైపులా కాయోత్సర్గ భంగిమ(కాళ్లపై నిటారుగా నిలిచి ఉన్న)లో మహావీరుని శిల్పాలు ఉన్నాయి. ఇన్నాళ్లుగా ఈ విగ్రహాలకు స్థానికులు పూజలు చేస్తున్నా.. రత్నాకర్‌రెడ్డి బుధవారం ఆ విగ్రహాలను వర్ధమాన మహావీరుడిగా గుర్తించారు. భౌతిక సుఖాలను త్యజించిన ఏకాగ్రత దీక్షను ఈ విగ్రహాలలోని నగ్నత్వం సూచిస్తుంది. దీంతో ఇవి వర్ధమాన మహావీరుడిదిగా గుర్తించారు.
గణేష్‌వాడ పరిసరాల్లో పూర్వం జైన దేవాలయం ఉన్నట్లుగా దేవాలయంలోని ప్రస్తుతం ఉన్న రాతి స్తంభంలోని ఒక్క ముక్క ఆధారంగా తెలుస్తోంది. మాతమ్మగా పిలిచే సరస్వతీ దేవాలయంలో ఆ ముక్క నేటికీ భక్తుల పూజలందుకుంటోంది. ఆరో శతాబ్దపు మొదట్లోనే జైన దేవాలయం శివాయంగా మారినప్పటికీ అది కూడా శిథిలమై కనుమరుగైంది.
గతంలో దేవాలయాల నిర్మాణంలో భారీ వినాయకుడు, శివలింగం, నాలుగు పలకల జైన స్తంభం వెలుగు చూశాయి. వీటి ఆధారంగా అక్కడ జైన దేవాలయం ఉండేదని తెలుస్తోంది. అలాగే, కొలనుపాక కేంద్రంగా కళ్యాణి చాళుక్యులు పాలన సాగించారు. వారి పాలనలో జైన మతం విలసిల్లిందని తెలుస్తోంది. ఇప్పటికీ జనగామ ప్రాంతంలో 'జైన' ఇంటి పేరుగా ఉన్న వైశ్యులు ఉండడం విశేషం. ఇంతటి ప్రాధాన్యం ఉండడం వల్ల పట్టణంలోని బతుకమ్మ కుంట మధ్య జైన తీర్థంకరుడు వర్థమాన మహావీరుడి(బాహుబలి) విగ్రహాన్ని నిలబెట్టడం సముచితంగా ఉంటుందని పరిశోధకులు, ప్రజలు భావిస్తున్నారు.