భావవ్యక్తీకరణ లేకే ఉద్యోగ సాధనలో విఫలం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భావవ్యక్తీకరణ లేనందువల్లే చాలామంది ఉద్యోగాలు సాధించలేక నిరుద్యోగులుగా ఉండిపోతున్నారని శ్రీ సాయిగురు రాఘవేంద్ర బ్యాకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ పి.దస్తగిరి అన్నారు. ‘బ్యాంకు ఉద్యోగాలు సాధించడమెలా’ అనే అంశంపై స్థానిక ఆనంద్ రీజెన్సీలో మంగళవారం నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఆంగ్లభాషపై పట్టుసాధించాలన్నారు. భావవ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరు బ్యాంకర్ కావాలనే లక్ష్యంతో ప్రతి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు హాజరైన నిరుద్యోగులకు ఆఫ్‌లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తూ పోటీ పరీక్షలకు కావాల్సిన ఉచిత మెటీరియల్, డీవీడీలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ తమద్వారా దేశవ్యాప్తంగా 21 వేల మంది ఉద్యోగాలు సాధించారన్నారు. అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కో డైరెక్టర్ పి.పేక్షావలిరెడ్డి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.