రైతులతో పోటెత్తిన బ్యాంకులు
అనంతపురం అగ్రికల్చర్ : రుణాల రెన్యూవల్స్, కొత్త రుణాల పంపిణీ కార్యక్రమాలతో బ్యాంకులన్నీ రైతులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 8 గంటలకే బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వాతావరణ బీమా పథకం వర్తింపు కోసం జూలై 15వ తేదీ ఆఖరి గడువు విధించడం, సంవత్సరంలోపే రెన్యూవల్స్ చేయించుకోవాల్సి ఉండటంతో రైతులందరూ ఇదే పనిమీద ఉన్నారు. వర్షాలు పడుతుండటం, ముంగారు సమీపిస్తుండటంతో చేతిలో డబ్బుల్లేక పంటల సాగుకు అవస్థలు పడుతున్నారు. ఎప్పుడో అందాల్సిన ఇన్‌పుట్, ఇన్సూరెన్స్ పరిహారం, రుణమాఫీ రాకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పంట రుణాల రెన్యూవల్స్ కోసం కూడా వడ్డీ కట్టడానికి అప్పులకు తిప్పలు పడుతున్నారు.
అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డి, నరసనాయునికుంట, తాటిచెర్ల, కొడిమి తదితర గ్రామాలకు చెందిన రైతులు స్థానిక కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ (ఏడీబీ) బ్యాంకు ఎదుట మంగళవారం బారులుతీరి కనిపించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... సకాలంలో రెన్యూవల్స్ కాక ఇబ్బందులు పడుతున్నామని, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ పరిహారం అందకపోవడం, రుణమాఫీ విడుదల కాకపోవడం వల్ల ఖరీఫ్‌కు సమాయత్తం కాలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.