బరంపార్కును తవ్వేశారు
బరంపార్కును తవ్వేశారు
Published Mon, Aug 8 2016 5:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
భవానీపురం : పర్యాటక శాఖకు చెందిన హరిత బరంపార్క్‌లో ఇక హరితం కనుమరుగు కానుందా? అవుననే చెప్పాలి. లక్షల రూపాయల ఖర్చుతో వేసిన గ్రీనరీ లాన్‌ను తొలగించి అక్కడ టైల్స్ వేయనున్నారు. బరంపార్క్‌కు వచ్చిన కలెక్టర్ బాబు.ఎ అక్కడి అధికారులకు, కాంట్రాక్టర్‌ను ఈ మేరకు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు పచ్చదనంతో అలరారుతున్న లాన్ ఇకపై వెలవెలబోతూ టైల్స్ దర్శనమివ్వనున్నాయి. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఈ లాన్‌లో కూర్చుని కృష్ణానది నుంచి వచ్చే చల్లనిగాలిని ఆస్వాదించేవారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ లాన్‌లోనే పెళ్లిళ్లు పేరంటాలు వంటి ఫంక్షన్‌లు నిర్వహించేవారు. వివాహ వేడుకలకు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇచ్చేవారు. పుష్కరాల పుణ్యమా అని ఇకపై ఇవన్నీ బంద్ అవుతాయి. పనుల్లో భాగంగా చిన్నారులు ఆడుకునే ఆట పరికరాలను కూడా తొలగించారు.
ఆలస్యంగా అభివృద్ధి పనులు
‘అతనికంటె ఘనుడు...’ అన్నట్లుగా పుష్కర పనులే ప్రభుత్వం ఆలస్యంగా మొదలు పెట్టిందనుకుంటుంటే ఇప్పుడు పర్యాటక శాఖకూడా హరిత బరంపార్క్‌లో చాలా లేటుగా పనులకు దిగింది. అదేమని అడిగితే ఉన్నతాధికారులనుంచి అనుమతి రాకపోవడమేనని చెబుతున్నారు. బరంపార్క్ ప్రవేశ ద్వారం నుంచి రిసెప్షన్ వరకు సిమెంట్ రోడ్ నిర్మిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు పల్లంగా ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని మెరక చేయిస్తున్నారు. కిచెన్ గదులను ఫుడ్ కోర్ట్‌లుగా తీర్చిదిద్దుతున్నారు. పుష్కరాల పేరుతో ఇక్కడ నిర్మిస్తున్న పున్నమి ఘాట్ కారణంగా బరంపార్క్ ఆవరణ మొత్తం పాడైపోయి ఆహ్లాదం, పచ్చదనం హరించుకుపోయాయని సందర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement