అంబరాన్నంటిన సంబురం
♦ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
♦ ఆటపాటలతో బతుకమ్మను సాగనంపిన ఆడపడుచులు
♦ హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై కన్నుల పండుగ
♦ ఎల్బీ స్టేడియంలో వేలాది బతుకమ్మలు పేర్చిన మహిళలు
♦ ట్యాంక్‌బండ్‌కు భారీ ర్యాలీగా శోభాయాత్ర
♦ అలరించిన సాంస్కృతిక శకటాలు, కళాకారుల ప్రదర్శనలు
♦ రంగురంగుల విద్యుత్ కాంతులు.. ఎల్‌ఈడీ బెలూన్‌లు
♦ మిన్నంటిన బాణసంచా వెలుగులు
సాక్షి, హైదరాబాద్: ‘పోయి రావమ్మా బతుకమ్మా.. మళ్లేడు దాకా సల్లంగ జూడు బతుకమ్మా.. వెళ్లిరావమ్మా..’ అంటూ కోట్లాది మంది మహిళలు తెలంగాణ ఆడపడుచును సాగనంపారు. ఇంటింటి ఆడపడుచుకు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలంతా తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మను పేర్చి, పసుపుతో గౌరమ్మను చేసి.. మనసు నిండా పూజించి, చల్లంగ చూడాలని మొక్కుకుని ఊరేగింపుగా చెరువుల వద్దకు చేరుకున్నారు. ‘ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక జాము అయే చందమామా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడి, బతుకమ్మ ఆడి ‘వెళ్లి రావమ్మా.. బతుకమ్మా.. పోయిరావమ్మా గౌరమ్మా..’ అంటూ సాగనంపారు. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, పద్మాక్షి అమ్మవారి గుడి ప్రాంగణం, భద్రకాళి ఆలయం వద్ద, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు వైభవంగా జరిగాయి. ఇక హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ‘సద్దుల బతుకమ్మ’ సంబరాలు అంబరాన్ని తాకాయి. వేలాది బతుకమ్మలు, జిల్లాల శకటాలు, కళాకారుల ప్రదర్శనలతో శోభాయాత్ర, రంగురంగుల విద్యుద్దీపాలు, బాణసంచా వెలుగులు. ఎల్‌ఈడీ బెలూన్లు అలరించాయి.
శోభాయమానం..
సోమవారం నుంచే హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో వేలాది మంది మహిళలు బతుకమ్మలను పేర్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 25 పెద్ద బతుకమ్మల వద్ద మంగళవారం సాయంత్రం ఐదున్నర సమయంలో ఎంపీ కవిత గౌరమ్మ పూజ చేశారు. ఆ తర్వాత కవితతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరారు. వారంతా స్టేడియం బయటకు అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న జిల్లాల శకటాలు, కళాకారులతో కలసి ట్యాంక్‌బండ్‌కు శోభాయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా నిర్వహించిన ఆటాపాటా, కళాకారుల ప్రదర్శనలు, నృత్యాలు, విన్యాసాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన 12 మంది కళాకారుల ఒగ్గుడోలు, డప్పు నృత్యాలు అలరించాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కళాకారులు చేసిన భేరీ నృత్యం అందరినీ ఆకర్షించింది. వివిధ జిల్లాలకు చెందిన అస్తిత్వాన్ని ప్రదర్శించే సాంస్కృతిక శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బాసర సరస్వతీ దేవి, పొచ్చెర్ల జలపాతం, వన దేవతలతో, అడవిని తలపించేలా రూపొందించిన ఆదిలాబాద్ శకటం.. గోల్కొండ, బిర్లా మందిర్‌తో ఐడీఎల్ కాలనీలో నిర్మిస్తున్న డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నమూనాతో కూడిన హైదరాబాద్ శకటం, వేములవాడ రాజరాజేశ్వర ఆలయం నమూనాతో రూపొందిన కరీంనగర్ శకటం, భద్రాచలం పుణ్యక్షేత్రంతో రూపొందించిన ఖమ్మం, మెదక్ మంజీరా శకటం, వరంగల్ కాకతీయ శకటం, ఆలంపూర్ జోగులాంబ ఆలయంతో మహబూబ్‌నగర్ శకటం ఆకట్టుకున్నాయి.
హాజరుకాని సీఎం, గవర్నర్..
సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొంటారని తొలుత ప్రకటించినా.. వారు హాజరుకాలేదు. గతేడాది వేడుకలకు వారు హాజరవడమే కాకుండా సీఎం సతీమణి, గవర్నర్ సతీమణి బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. ఈసారి రాకపోవడంతో చాలా మందికి నిరాశే ఎదురైంది. ట్యాంక్‌బండ్ వద్ద డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, అజ్మీరా చందులాల్, టి.పద్మారావు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
సీఎం అధికారిక నివాసంలో...
సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం సీఎం సతీమణి శోభారాణి, కుమార్తె కవిత, పలువురు మహిళలు బతుకమ్మను పేర్చారు. అనంతరం అక్కడే బతుకమ్మ ఆడారు. బంజరాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలోనూ బతుకమ్మ శోభ కనిపించింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కవిత, కొందరు మంత్రుల భార్యలు బతుకమ్మను పేర్చారు.
జన సాగరం.. పూలహారం
రాత్రి 8 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై లాంఛనంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అప్పటికే బతుకమ్మల శోభాయాత్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో మహిళలు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. వేడుకలకు హాజరైన అతిథులు, అధికారులు పెద్ద సంఖ్యలో ఎల్‌ఈడీ బెలూన్‌లను గాల్లోకి వదిలారు. మరింత ఎత్తుకు వెళుతున్న కొద్దీ ఈ బెలూన్లు నక్షత్రాల్లా కనిపిస్తూ ఆకట్టుకున్నాయి.
అనంతరం మహిళలు బతుకమ్మ ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు బతుకమ్మ ఆడారు. వేడుకల నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని, జీవన విధానాన్ని, చరిత్రను ప్రతిబింబించే బతుకమ్మ పాటలు అలరించాయి. ఇక రంగురంగుల బాణసంచా మెరుపులతో హుస్సేన్‌సాగర్‌పై హరివిల్లులు విరబూశాయి. బతుకమ్మ శోభాయాత్ర నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఘట్టాన్ని హైదరాబాద్ అంతటా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఓరుగల్లులో వైభవంగా..
సాక్షి ప్రతినిధి, వరంగల్: చారిత్రాత్మక వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. బతుకమ్మ పుట్టుకతో సంబంధమున్న దేవతగా భావించే పద్మాక్షి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం జరిగిన వేడుకలలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. తంగేడు, గునుగు, సీతజడ, గుమ్మడి తదితర తీరొక్క పూలతో మురిపెంగా పేర్చిన బతుకమ్మలతో చెరువుల వద్దకు చేరుకున్నారు. బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడారు. భద్రకాళీ దేవాలయ ప్రాంగణం, రంగలీలా మైదానం, బంధం చెరువు, కట్టమల్లన్న చెరువు, పోచమ్మ మైదాన్, వడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం చెరువు తదితర చోట్ల బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల పట్టణాల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.