ప్రజల బతుకు బంగారం కావాలి
- అందుకే బతుకమ్మ ఉత్సవాలు
- జాగృతి అధ్యక్షురాలు కవిత
- 12 నుంచి 19 వరకు ఉత్సవాలు
- బతుకమ్మ వాల్ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రజల బతుకు బంగారం కావాలనే.. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆమె బతుకమ్మ పండుగ వాల్ పోస్టర్, పాటల సీడీలు, పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పది జిల్లాల జాగృతి అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నామని, ఇప్పటికీ అనేక ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఉత్సవాల నిర్వహణకు తన నగలు తాకట్టు పెట్టిన సందర్భాలున్నాయని గుర్తుచేసుకున్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ నిర్వహించిన గణేశ్ ఉత్సవాల స్ఫూర్తితోనే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యమాల్లో సాంస్కృతిక ప్రాధాన్యం గుర్తించిన జాగృతి.. రాష్ట్ర మహిళలందరినీ బతుకమ్మతో ఏకతాటిపైకి తీసుకొచ్చిందని వివరించారు. బతుకమ్మ ఆడుకోవడానికి హైదరాబాద్‌లో ఒకప్పుడు ఇబ్బంది ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశామని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు ఎక్కడెక్కడ నిర్వహిస్తారో ఆమె వెల్లడించారు.
ఇవీ పట్టణాలు.. తేదీలు..
అక్టోబరు 12న నర్సంపేట (వరంగల్ జిల్లా), 13న హుస్నాబాద్ (కరీంనగర్), 14న కామారెడ్డి (నిజామాబాద్), అక్టోబర్ 15న కౌడిపల్లి (మెదక్), 16న వికారాబాద్ (రంగారెడ్డి), 17న కొత్తకోట (మహబూబ్‌నగర్), 18న ముంబై (మహారాష్ట్ర), 19న దేవరకొండ (నల్లగొండ)లో బతుకమ్మ పండుగను నిర్వహించనున్నట్లు తెలిపారు.