కాపులను బీసీల్లో చేర్చొద్దు
- మంజునాథన్ కమిటీని అడ్డుకుంటాం
- రాష్ట్ర బీసీ నాయకుల సమావేశం
కొత్తపల్లి (పిఠాపురం) : కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, బీసీ నాయకుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కొత్తపల్లి ఊరచెరువు సెంటర్‌లో వున్న సతీష్‌చంద్రభవన్‌లో మంగళవారం రాష్ట్ర బీసీ నాయకులు, స్థానిక నాయకులతో మాజీ ఎంపీటీసీ కాకరపల్లి గంగాధర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలు విద్య, ఉద్యోగ అవకాశాలనే కాక రాజకీయ పదవులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులను, హక్కులను కోల్పోతారన్నారు. కాకినాడలో జరగబోయే మంజునాథన్ కమిటీ పర్యటనను అడ్డుకుంటామన్నారు. కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రకటించిందని, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా చంద్రబాబు 50 శాతం సబ్సిడీతో రుణాలను అందిస్తున్నారన్నారు. బీసీల్లో 144 కులాలు వున్నాయని వారికి మాత్రం 30 శాతం సబ్సిడీ కల్పిస్తున్నారన్నారు. అధికారం కోసం ఎన్నికల్లో అడగని వాగ్దానాలు చేసి బీసీలు, కాపుల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. 93 కులాల బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర గణేష్‌బాబు, జిల్లా రజిక సంఘం నాయకుడు మురముళ్ల రాజాబాబు, జిల్లా పద్మశాలి సంఘ నాయకుడు పొన్నగంటి సత్యనారాయణ, పెద్దాపురం నియోజకవర్గ బీసీ నాయకుడు పెంకె వెంకటేష్‌బాబు, జిల్లా మత్స్యశాఖ నాయకుడు తుమ్మల రమేష్, మండల శెట్టిబలిజల సంఘ నాయకుడు కొప్పిశెట్టి ఈశ్వరరావు, మదర్‌ఇండియా ఇంటర్నేషనల్ చైర్మన్, బీసీ ఐక్య సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లి తిరుపతిరావు పాల్గొన్నారు.