ఎలుగుబంటి బీభత్సం
- ఐదుగురిపై దాడి
- ఇంట్లో బంధించిన పోలీసులు
- ఆలస్యంగా చేరుకున్న అటవీ శాఖ అధికారులు
- ఆత్మకూరు ఫారెస్ట్ కార్యాలయానికి తరలింపు
కొత్తపల్లి: నల్లమల అటవీ సమీపంలోని జడ్డువారి పల్లె, సింగరాజుపల్లె గ్రామాల్లో శుక్రవారం ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. ఐదుగురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. జడ్డువారి పల్లె గ్రామానికి చెందిన కదిరి బొందమ్మ మేకల మందను తోలుకుని గ్రామశివారులోని బావి వద్దకు చేరుకుంది. మేకలు బెదరడంతో ఏముందని మహిళ బావి దగ్గరకు వెళ్లి చూసింది. ఆమెపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలకు గురై కేకలు వేయడంతో స్థానికులు కర్రలు పట్టుకుని ఎలుగుబంటిని తరమికొట్టారు. అక్కడి నుంచి పరుగులు తీసిన ఎలుగుబంటి 8 కిలో మీటర్ల దూరంలోని సింగరాజు పల్లె గ్రామంలో చొరబడి పూసల లాజర్, జంగం వెంకటేశ్వర్లు, కొప్పుల పెద్ద లింగస్వామిపై దాడి చేసింది. వీరిలో పెద్దలింగస్వామి, పూసల లాజర్‌ల పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజల కేకలకు మరింత ఆగ్రహంతో ఎలుగుబంటి మాదిగ శ్రీరాములు ఇంటిలోకి చొరబడి అతని భార్య లక్ష్మమ్మపై దాడి చేయబోగా ప్రజలు ఆమెను రక్షించారు.
ఎలుగుబంటి అక్కడి నుంచి మరో చోటికి వెళ్లకుండా ఆ ఇంటి చుట్టు కర్రలు పట్టుకుని కాపలా కాశారు. ఈ సమాచారం తెలుసుకున్న కొత్తపల్లి ఎస్‌ఐ శివశంకర్‌నాయక్ హుటాహుటిన సంఘటన చేరుకుని స్థానికుల సాయంతో ఎలుగుబంటిని ఇంట్లోనే నిర్బంధించి తాళం వేశారు. అనంతరం ఆత్మకూరు డీఎఫ్ సెల్వం, బైర్లూటీ ఎఫ్‌ఆర్‌ఓ శంకరయ్య, ఆత్మకూరు ఎఫ్‌ఆర్‌ఓ బాలసుబ్బయ్య, ఫారెస్ట్ సిబ్బంది ఆలస్యంగా సింగరాజుపల్లెకు చేరుకున్నారు. రాత్రి ఏడుగంటల సమయంలో ఎలుగుబంటిని బంధించి ఆత్మకూరు ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి నల్లమల ఫారెస్ట్‌లో రామయ్యకుంట, బుగ్గవాగు ప్రదేశంలో వదలనున్నట్లు డీఎఫ్‌ఓ సెల్వం తెలిపారు.అలాగే ఎలుగుబంటి దాడిలో గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామన్నారు.