తేనెటీగల ‘చంద్రారెడ్డి’
Published Sat, Jul 16 2016 6:08 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
రాజాపురం(పాల్వంచ రూరల్) : వ్యవసాయ కుటుంబమే అయినా సాగుపై అవగాహన లేదు.. అయినా సేంద్రియ సాగుపై మక్కువ పెంచుకున్నాడు.. తనకున్న భూమిలో పూల మొక్కలు.. కూరగాయలు పండించడం.. చేపల పెంపకం చేపట్టాడు.. దిగుబడి రాకున్నా నిరాశ చెందలేదు.. మలి ప్రయత్నంలో రకరకాల చేపల పెంపకంతోపాటు తేనెటీగల పెంపకం నిర్వహిస్తున్నాడు. ఒక దశకు వచ్చిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ.. తేనె ద్వారా మంచి లాభాలు గడిస్తున్నాడు ఖమ్మం జిల్లా రాజాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కందుల చంద్రారెడ్డి. అనంతపురం నుంచి తెచ్చిన నైజీరియా తేనెటీగల ట్రేలను తెచ్చి ఇంటి పరిసరాల్లో వాటిని పెంచుతున్నాడు. విషయం తెలిసిన పలువురు రైతులు వాటి పెంపకం గురించి అడిగి మరీ తెలుసుకుంటున్నారు.
తేనెటీగల్లో నాలుగు రకాలు
కొండ, పుట్ట, నైజీరియా, ముసురు తేనెటీగలు. నైజీరియా తేనెటీగల పెంపకం వల్ల ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ. పెంపకం కూడా తేలికగా ఉంటుందని అనుభవం కలిగిన పలువురు రైతులు అంటున్నారు. బాక్స్‌లో ఉండే నైజీరియా తేనెటీగలను ఇంటి పరిసరాల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బాక్స్(ట్రే)లో రాణి ఈగతోపాటు వంద మగ ఈగలు ఉంటాయి. వాటికి తోడు రెండు లక్షల చిన్న చిన్న ఈగలు ఉంటాయి. ఈగలకు ఆహారంగా రోజు బాక్సుల్లో పంచదారతో కలిపిన ద్రావకం పోస్తే సరిపోతుంది. పొప్పడి పూలు పూచే సమయంలో నవంబర్ నుంచి జనవరి నెలల్లో ఈగలు వాటిని తిని.. తేనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటాయి.30 బాక్సుల్లో తేనెటీగలను పెంచుకున్న రైతుకు ఒక్కో బాక్స్ ద్వారా నెలకు 3 నుంచి 5 కేజీల తేనె దిగుబడి వస్తుంది. రెండు నెలల్లో రైతు పెంచిన తేనెటీగల ద్వారా 90 కేజీల తేనె దిగుబడి వస్తుంది.
తేనె తీసే పద్ధతులు
బాక్స్‌లో ఉండే తేనె బయటకు తీసేందుకు కొన్ని పద్ధతులున్నాయి.
బాక్స్‌లోని తేనెను నెలకోసారి లేదా రెండు నెలలకోసారి తీయాలి. దీనికోసం ముఖానికి మాస్కులు ధరించి మరో చేతిలో పొగ పట్టుకుని తేనెటీగల బాక్సును తెరవాలి. అందులో ఉన్న తేనెతుట్టెను బయటకు తీసి ఒక యంత్రంలో వేయాలి. అప్పుడు ఈగలు కుట్టకుండా తేనెతుట్టె నుంచి తేనె బయటకు వస్తుంది.
మార్కెట్‌లో మంచి గిరాకీ
తేనెకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. కల్తీ లేని నైజీరియా తేనెటీగల ద్వారా లభించే తేనె కేజీ రూ.450 నుంచి రూ.500 చొప్పున ధర పలుకుతోంది.
Advertisement
Advertisement