
ఎరువులకు బయోమెట్రిక్
- మే నెల నుంచి అమలుచేసే యోచన
- రైతులకు పొంచివున్న కష్టాలు
ఉదయగిరి: రైతులు ఇప్పటివరకు తమకు కావాల్సిన ఎరువులను నేరుగా ఎరువుల దుకాణానికి వెళ్లి తీసుకునే వారు. కానీ మే నెల నుంచి ఈ విధంగా కొనుగోలు చేసేందుకు వీలుకాదు. దీనికి కారణం ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీంతో ఎరువులు కొనుగోలు చేసే రైతు ఎరువుల వ్యాపారుల వద్దనున్న బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్రలు, ఐరిష్ సరిపోలితేనే ఎరువులు ఇస్తారు. లేకపోతే ఎరువులు తీసుకునే అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుంది. ఆ ప్రాంతాల్లో ఈ విధానం విజయవంతం కావడంతో మే నెల నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి తేవాలని యోచిస్తోంది.
అమలు విదానం
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల ఎరువులకు సబ్సిడీలు నేరుగా కంపెనీలకు చెల్లిస్తోంది. అందులో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్రం గుర్తించింది. ఈ అవినీతిని అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేవాలని సంకల్పించింది. ఈ క్రమంలో కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన ఎరువులను డీలర్లకు పంపిణీ చేస్తారు. గతంలో అయితే సరుకులు డీలర్లకు అందిన వెంటనే ప్రభుత్వం సబ్సిడీ నేరుగా కంపెనీలకు అందచేసేది. ప్రస్తుత విధానంలో డీలరు నుంచి రైతు కొనుగోలు చేసిన ఎరువులకు మాత్రమే సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తుంది. దీంతో ఖచ్చితత్వం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
రైతులకు తిప్పలు తప్పవా!
జిల్లాలో సుమారు పది లక్షల ఎకరాల్లో వివిధ రకాల పైర్లు సాగు చేస్తారు. ఇందుకుగాను ఖరీఫ్ సీజన్‌లో యూరియా 34,320 మెట్రిక్ టన్నులు, డీఏపీ 9899 మెట్రిక్ టన్నులు, పొటాష్ 7798 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 24,699 మెట్రిక్‌టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్ 4944 మెట్రిక్ టన్నులు విని యోగిస్తారు. అదేవిధంగా రబీ సీజన్‌లో 4,93,589 మెట్రిక్ టన్నులు డీఏపీ, 10,583 పొటాష్ 8806, కాంప్లెక్స్ ఎరువులు 14588 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్ పాస్పేట్ 6327 మెట్రిక్ టన్నులు వినియోగిస్తారు. ఈ విధానం అమల్లోకొస్తే ఎరువులు కొనుగోలు రైతులకు కష్టతరంగా మారనుంది. ఇప్పటివరకు తమకు అవసరమైన ఎరువులను నేరుగా దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసేవారు. కానీ కొత్త విధానంలో పీబీటీ, ఈ–పాస్ మిషన్‌లో వేలిముద్రలు వేసి ఎరువులు తీసుకోవాల్సివుంది.
వేలిముద్రలు పడని వ్యక్తులకు ఐరిష్ ద్వారా ఎరువులు అందచేస్తారు. ప్రస్తుతం రైతులకు కావలసిన ఎరువులన్నీ కొనుగోలు చేయవచ్చు. ఆంక్షలైతే లేవు. కానీ భవిష్యత్తులో ఎరువులు కొనుగోలు కూడా కోటా పద్ధతినే అనుసరించే అవకాశముంది. రైతులకు సంబంధించిన ఆధార్, వ్యవసాయ భూములతో ఖచ్చితంగా అనుసంధానం కావాల్సివుంది. ఆన్‌లైన్లో ఆ రైతు పేరుమీద ఉన్న భూములకు మాత్రమే ఎరువులు అందించే అవకాశముంది. రాన్రాను వ్యవసాయ అధికారులు ఒక ఎకరాకు సిఫార్సు చేసిన ఎరువులు మాత్రమే రైతులకు అందే అవకాశముంది. ఈ పరిణామం రైతులకు కొంత ఇబ్బందిగా మారవచ్చు. ఈ విధానం మంచిదే అయినప్పటికీ చిత్తశుద్ధితో అమలు ప్రక్రియపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శిక్షణ తరగతులు
పదిహేను రోజుల క్రితం ఈ విధానం అమలుచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది వ్యవసాయాధికారులను ఎంపికచేసి విజయవాడలో మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు ఆయా వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోవున్న వ్యవసాయాధికారులకు శిక్షణ ఇస్తారు. ఈ వ్యవసాయాధికారులు వారి పరిధిలోవున్న ఎరువుల దుకాణ యజమానులకు శిక్షణ ఇస్తారు. ఏప్రిల్‌లో చివరి వారానికి అన్ని ఎరువుల దుకాణాలకు డీబీటీ, ఈ–పాస్ యంత్రాలను సరఫరా చేస్తారు. మే నెల 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఈ విధానాన్ని కష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని మండలాలలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. జిల్లావ్యాప్తంగా దీన్ని అమలు చేసేందుకు మూడు రోజుల క్రితం జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఎంపిక చేసిన అధికారులతో జిల్లాస్థాయి వ్యవసాయాధికారులు సమావేశం ఏర్పాటుచేసి ఈ ప్రక్రియ వేగవంతం చేసేందుకు పలు సూచనలిచ్చారు.