సందీప్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
ఖమ్మం రూరల్: ఆ చిన్నారికి అది తొలి పుట్టినరోజు. జ్వరం రావడంతో వేడుకలు నిర్వహించలేదు. కానీ, ఆ రోజే అతడికి చివరిరోజైంది. గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి శ్వాస ఆడక చిన్నారి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన కాచిరాజుగూడెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వీర్ల గోవర్దన్, సునీత దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
చిన్నకుమారుడు సందీప్ (1) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి ఏమీ తినడం లేదు. ఆదివారం సందీప్‌కు తల్లి సునీత అన్నం తినిపిస్తోంది. ఈ క్రమంలో అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి శ్వాసతీసుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. గమనించిన తల్లి కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి చిన్నారిని చికిత్స నిమిత్తం ఖమ్మం పట్టణానికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. ఆదివారం రోజునే సందీప్ పుట్టిన రోజు కావడం, అదే రోజు అతడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం అక్కడివారికి సాధ్యపడలేదు.