- పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
ఖమ్మం అర్బన్ : ఫ్రెండ్‌షిప్ డే వేడుకల్లో భాగంగా కొంతమంది యువకులు బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం. నగరంలోని మధురానగర్ రోడ్డులో నూతనంగా ఓ హోటల్ నిర్వహకులు యువకులకు వివిధ పోటీలను నిర్వహించారని, అందులో భాగంగానే కొంతమంది బైక్ రేసింగ్ నిర్వహించారని తెలిసింది. మొదటిస్థానం సాధించినవారికి రూ.5 వేలు ఇచ్చినట్లు సమాచారం. పోటీల్లో పాల్గొన్న ఓ యువకుడు కిందపడిపోయి తీవ్ర గాయాలపాలైనట్లు తెలిసింది. పోటీల్లో మెడికోలు, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మమతా రోడ్డులో బైక్ రేసింగ్ నిర్వహించడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవడంతో స్థానికులు 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో అర్బన్ పోలీసులు సంఘటనా స్థనాలనికి చేరుకుని కొంతమంది యువకులను అదపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అర్బన్ సీఐ శ్రీధర్‌ను వివరణ కోరగా బైక్ రేసింగ్‌లు జరిగినట్లు తమకు సమాచారం లేదన్నారు. కొంతమంది యువకులు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతుంటే గుర్తించి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.