రైతులకు అన్యాయం చేశారంటూ..
వాటర్ ట్యాంక్ ఎక్కిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్
శెట్టూరు : గత ఏడాది ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయడంలో ప్రభుత్వం అవలంభించిన రైతు వ్యతిరేక విధానాలపై కళ్యాణదుర్గం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ లేపాక్షి బుధవారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీరామరెడ్డి వాటర్ ట్యాంక్ ఎక్కి ఇన్‌పుట్ సబ్సిడీలో రైతులకు అన్యాయం జరిగిందంటూ నినదించారు.
గ్రామానికి చెందిన పలువురు రైతులు అప్రమత్తమై ఆయనకు మద్దతుగా ట్యాంక్ కిందనే నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న శెట్టూరు ఎస్‌ఐ శ్రీకాంత్, సిబ్బందితో అక్కడకు చేరుకుని లేపాక్షితో చర్చలు జరిపారు. ఎంతసేపటికి కిందకు దిగి రాకపోవడంతో పోలీసులే ట్యాంక్‌పైకి ఎక్కి లేపాక్షిని అదుపులోకి తీసుకుని శెట్టూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీలో ప్రభుత్వం రైతలుకు అన్యాయం చేసిందంటూ ఈ సందర్భంగా ఆయన నినాదాలు చేశారు.