
టీడీపీ తీరు ఇబ్బందికరం
విజయవాడ(భవానీపురం) : ప్రత్యేక హోదా పై టీడీపీ వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా వుందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ .విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఎన్టీఏలో భాగస్వామ్యంగా వున్నామన్న విషయం కూడా ఆ పార్టీ నేతలు మరిచిపోయారని విమర్శించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలు మారినవారు, రాత్రికి రాత్రి పదవులు పొందిన టీజీ వెంకటేష్, బు ద్దావెంకన్న, ముద్దు కృష్ణమనాయుడు వంటి వారు అధినేత మెప్పు కోసం బీజేపీని విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు.
అల్లూరి స్మృతి చిహ్మాన్ని సందర్శించనున్న రైల్వేమంత్రి
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులు స్మృతి చిహ్నాలను సందర్శించి వారికి నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. దేశం మొత్తంమీద 200 ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసినట్లు చెప్పారు. అల్లూరి సీతారామరాజు జన్మస్ధలమైన విశాఖ జిల్లాలో జరిగే కార్యక్రమంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ఎంపీ కంభంపాటి హరిబాబు పాల్గొంటారని తెలిపారు.
నిరుద్యోగుల వయసును సడలించాలి
ఏపీపీఎస్‌సీ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకుగాను నిరుద్యోగులకు మేలు జరిగేలా వారి వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు సడలించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ ,ఎస్టీలకు మరో మరో రెండేళ్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిక్కాల రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శులు సురేంద్రమోహన్, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.