కూలీలకు నల్లకుబేరుల ఎర
Published Wed, Nov 16 2016 12:42 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
ఆత్మకూరు రూరల్: పనులు లేక ఇబ్బందులు పడుతున్న వ్యవసాయ కూలీలకు నల్లకుబేరులు పని కల్పిస్తున్నారు. నోట్ల మార్పిడికి ఎర వేస్తూ కమీషన్ ఇస్తున్నారు. ఆత్మకూరు మండలంలో ఓ గ్రామానికి చెందిని కొందరి కూలీలను ఎంపిక చేసుకుని ఒక్కొక్కరికి భోజన సౌకర్యం, చార్జీలు ఇస్తూ కూలి కింద రూ. 500 ఇస్తున్నారు. వీరంతా ఉదయాన్నే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు చేతపట్టుకుని నల్లకుబేరులు ఇచ్చే పెద్ద నోట్లు తీసుకుని కర్నూలుకు వెళ్తారు. అక్కడ నోట్లు మార్చుకుని తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నా, వేర్వేరు బ్యాంకుల వద్ద క్యూలో నిలిచి నోట్లు మారుస్తున్నారు. ఇలా నల్ల కుబేరులు దర్జాగా కూలీలను ఉపయోగించి బ్లాక్ సొమ్మును వైట్‌గా మార్చుతున్నారు.
బ్యాంకులో బ్లాక్ అండ్ వైట్ దందా
పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య జనాలను ధైర్యం కలిగించాల్సిన బ్యాంకు అధికారుల్లో కొందరు కమీషన్ల కక్కుర్తికి పాల్పడి నల్లకుబేరులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రముఖ బ్యాంకు మేనేజరు 10 శాతం కమీషన్‌తో నోట్లను మార్చుతున్నట్లు తెలుస్తోంది. రోజు క్యూలో నిలబడి తమ ఆధార్‌ను, డిక్లరేషన్‌ను సమర్పించి బ్యాంకులో నోట్లు మార్చుకుంటున్న సామాన్యుల ఆధార్ కార్డులను తిరిగి జిరాక్స్ చేయించి వాటిని ఆధారంగా బ్యాంకు అధికారి నోట్ల మార్పిడికి తెగిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణానికి చెందిన ఓ బడా బాబుకు ఒకే రోజు రూ. 2లక్షల పెద్ద నోట్లకు మార్పిడి నోట్లు ఇచ్చినట్లు సమాచారం.
Advertisement
Advertisement