♦ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
♦ ముద్దనూరు యువకుడిపై కేసు నమోదు
తాడిపత్రి రూరల్: ‘నువ్వంటే నాకిష్టం.. నా వెంట వస్తావా, లేదా? రాకపోతే నిన్ను బతకనివ్వను. చంపేస్తానంటూ’ తనను ముద్దనూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్ అనే యువకుడు బెదిరిస్తున్నట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలం చిన్నపోలమడ గ్రామానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్‌కుమార్ గతంలో పెళ్లి చూపుల పేరుతో తమ ఇంటికి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ సంబంధం పెద్దలకు నచ్చక వద్దన్నారని ఆమె వివరించింది. ఆ తరువాత ఈ నెల 6న తన మేనమామతో వివాహమైందని తెలిపింది. ఈ విషయం తెలిపినా విన్పించుకోకుండా తనతో రాకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. సదరు యువకుడిపై చర్యలు తీసుకొని తన జీవితాన్ని, కాపురాన్ని నిలబెట్టాలని వేడుకుంది. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.