బ్రహ్మరథం
బ్రహ్మరథం
Published Tue, Jan 10 2017 10:11 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
ముగిసిన మొదటి విడత రైతు భరోసా యాత్ర
- హారతులు, బాణసంచాతో స్వాగతం
- ఊరూరా బారులు తీరి
ఆప్యాయత పంచిన ప్రజలు
- వృద్ధులు, వికలాంగుల కష్టాలు
పంచుకున్న జగన్
- పొలాల్లోకి వెళ్లి రైతులతో
మాట కలిపిన జననేత
- గాజులపల్లె బహిరంగ
సభకు పోటెత్తిన జనం
ఆత్మకూరు: పంటలు పండక.. చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మొదటి విడత రైతు భరోసా యాత్ర మంగళవారంతో ముగిసింది. శ్రీశైలం నియోజకవర్గంలో ఆరు రోజుల పాటు పర్యటించిన ఆయన ప్రజలతో మమేకమయ్యారు. గ్రామ గ్రామాన అనూహ్య స్పందన లభించింది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఆదరించిన తీరు.. వృద్ధులు, వికలాంగులు, రైతులు, కూలీలకు జీవితంపై భరోసా కల్పించగా.. అక్కాచెల్లెమ్మలను ఆశీర్వదిస్తూ.. యువతకు దిశేనిర్దేశం చేశారు. చివరి రోజు పల్లెల్లో పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ స్వాగతం పలకడం ఆయనకున్న జనాదరణకు అద్దం పట్టింది. మొత్తం పర్యటనలో మండుటెండలో.. రాత్రి పొద్దుపోయాక కూడా ప్రజలు బారులు తీరి స్వాగతించడం విశేషం.
పంటల దుస్థితికి చలించిన ప్రతిపక్ష నేత
శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆయా మండలాల్లో పంటల దుస్థితిని చూసి చలించిపోయారు. శ్రీనగరం సమీపంలో పసుపు పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెమ్మగిల్లిన కళ్లతో రైతులు మాట్లాడుతూ పంట సరిగా రాలేదని, తెగుళ్లతో పాటు గిట్టుబాటు ధర లేకపోవడంతో కనీసం కౌలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. ఆ తర్వాత వరి, మిరప, పెసర పంటలను పరిశీలించి రైతుల స్థితిగతులపై ఆరా తీశారు. రైతుల బాధలు తెలుసుకున్న జగన్ వారిని ఓదారుస్తూ మన ప్రభుత్వంలో రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు.
30 కిలోమీటర్లు.. 6 గంటల రోడ్‌షో
మహానంది మండలంలో ఆరో రోజు చేపట్టిన భరోసాయాత్ర బుక్కాపురం నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా ప్రజలు బారులు తీరి స్వాగతం పలుకుతుండటంతో మూడు గ్రామాల రోడ్‌షో 6 గంటల పాటు సాగింది. నడిచేందుకు వీలు కాని వృద్ధులు కూడా అతి కష్టం మీద కర్రల సహాయంతో ఎదురొచ్చి పలుకరించారు. వికలాంగులు కూడా ఆయనను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. గాజులపల్లె గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ వద్ద జగన్ రోడ్‌షోను చూసి విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. విద్యార్థులు భారతి, నాగమణి, ఆయిషాలను బాగా చదువుకోవాలని జగన్ కోరడంతో మంచి మార్కులతో పాసవుతామంటూ బాలికలు చెప్పారు. ఈ సందర్భంగా జననేతతో కరచాలనానికి విద్యార్థులు పోటీపడ్డారు.
గాజులపల్లెలో ఘన స్వాగతం..
మొదటి విడత భరోసా యాత్రలో భాగంగా చివరి రోజు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గాజులపల్లెలో యాత్ర ముగించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయనకు ఘనస్వాగతం పలికారు. బస్సాపురం, గుండంపాడు, మాదాపురం, ఆంజనేయస్వామి కొట్టాల, పచ్చర్ల గ్రామాల్లోనూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత మాలలు వేస్తూ స్వాగతించారు. దారి పొడవునా యువత పెద్ద ఎత్తున బారులు తీరి ఈలలు, కేకలతో మద్దతు తెలిపారు.
మల్లన్న, మహానందీశ్వర స్వాముల దర్శనం
రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండవ రోజు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఐదవ రోజు ఓంకారేశ్వరుడి సేవలో తరించగా.. చివరి రోజు మహానందిలో కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మొత్తంగా నల్లమల అటవీ పరిధిలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ న్‌చార్జి బుడ్డా శేషారెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జీలు రాజగోపాల్ రెడ్డి, చెరుకులపాడు నారాయణ రెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, ముంతల విజయభాస్కరరెడ్డి, మద్దయ్య, రాజా విష్ణవర్దన్‌రెడ్డి, కేవీ ప్రసాదరెడ్డి, రఘురెడ్డి, విశ్వనాథరెడ్డి, ద్వారం మాధవరెడ్డి, వెంకటేశ్వర యాదవ్, సత్యం యాదవ్, శరభారెడ్డి, లాయర్ వివేకానందరెడ్డి, మధుసూదన్, దేవ, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement