అభిమాన తరంగం | wave of affiction | Sakshi
Sakshi News home page

అభిమాన తరంగం

Published Sun, Jan 8 2017 10:46 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

అభిమాన తరంగం - Sakshi

అభిమాన తరంగం

పులకిస్తున్న ఊరూవాడా
- నాలుగో రోజు 50 కిలోమీటర్లు
  సాగిన రైతు భరోసా యాత్ర
- రైతుల బాధలు తెలుసుకుని
  ప్రభుత్వంపై నిప్పులు
- లింగాపురంలో ఆకట్టుకున్న
  చిన్నారుల ప్రసంగం
- తామంతా జగన్‌ వెంటేనంటూ ప్రతిన
- మనవడిగా వృద్ధులకు
  ఆప్యాయతానురాగాలు
- గ్రామ గ్రామాన వెంట నడిచిన యువత 
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కుటుంబ సభ్యునిగా.. ఆత్మీయునిగా.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు భరోసానిచ్చేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రలో ఆదివారం అడుగడుగునా అభిమానం పోటెత్తింది. నాలుగో రోజు వేల్పనూరు నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరిన ఆయన చిన్నదేవళాపురం, నారాయణాపురం, సంతజూటూరు మీదుగా లింగాపురం, జీసీ పాలెం చేరుకుంది. ఈ రెండు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించి పాలాభిషేకం చేశారు. అక్కడి నుంచి సింగవరం, సోమయాజులపల్లె, మణికంఠాపురం మీదుగా ఈర్నపాడు వరకు యాత్ర సాగింది. మొత్తం 11.30 గంటల పాటు సాగిన నాలుగో రోజు భరోసా యాత్ర దాదాపు 50 కిలోమీటర్లు కొనసాగింది. యాత్రంలో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను జగన్‌ తెలుసుకునే ప్రయత్నం చేశారు. గత మూడేళ్లుగా కరువుతో పంటలు లేవని.. ఇప్పుడు పండించిన కొద్దిపాటి పంటలకూ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు మండిపడ్డారు. రైతులను మోసం చేస్తే కనీసం డిపాజిట్‌ కూడా రాదనే భయాన్ని కలిగించాలని రైతులకు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణాపురంలో మిరప రైతుతో మాట్లాడి సమస్య తెలుసుకున్న ఆయన.. లింగాపురం, సింగవరం, ఈర్నపాడుల్లో భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి చేసిన ఆవేశపూరిత ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
 
పింఛన్లపై పోరాటం
ప్రధానంగా రైతు భరోసా యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలో తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను ప్రేమగా పలుకరిస్తూ జగన్‌ ముందుకు కదులుతున్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, వితంతువులు తమకు పింఛను రావడం లేదని ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. అర్హత ఉన్నా తమకు పింఛను ఇవ్వడం లేదని తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. అంతేకాకుండా గతంలో వచ్చే పాత పింఛన్లను కూడా తీసేశారని వివరించారు. ఈ నేపథ్యంలో పింఛన్ల కోసం కోర్టులో కేసు వేసి పోరాడదామని జగన్‌ వారికి ధీమా ఇచ్చారు. మరోవైపు రైతులు కూడా తమకు గిట్టుబాటు ధర లేదని విన్నవించారు. దేవుణ్ణి గట్టిగా కోరుకోవాలని.. ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. ఏడాది పాటు నిల్వ ఉంచుకోగలిగిన ఉల్లి, మిర్చి తదితర పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు కదా అన్న జగన్‌ మాటలు రైతులను ఆలోచింపజేశాయి. ఎన్నికల ముందు మద్దతు ధర కల్పించేందుకు రూ.5 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానన్న పెద్ద మనిషి కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కర్నూలు సోనా పేరు ఎత్తగానే రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. దేశంలోనే పేరుగాంచిన కర్నూలు సోనాకు ధర లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఆకట్టుకున్న పిల్లల మాటలు
లింగాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత చివర్లో పిల్లలు సంగీత, అఖిలలు మాట్లాడారు. 2019లో ఫ్యాన్‌కు ఓటెయ్యండి.. దుమ్ము దులపండి అని చిన్నపాప సంగీత అనగానే సభలో ఈలలు, కేకలు వేశారు. ఇక అఖిల అనే అమ్మాయి మాట్లాడుతూ... రైతులు, విద్యార్థుల సమస్యలు తీరాలంటే 2019 సీఎం జగన్‌ కావాలని నినదించారు. అంతేకాకుండా తమ గ్రామం జగన్‌ వెంట ఉంటుందని పేర్కొంది. మొత్తం మీద తమ మనస్సులోని మాటలనే చిన్నపిల్లలైనప్పటికీ వారు వెలిబుచ్చారని పలువురు అభిప్రాయపడ్డారు.  
 
కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యేలు గౌరుచరిత, ఐజయ్య, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌ రెడ్డి, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ ఖాన్, పార్టీ నేతలు అడ్వకేట్‌ మాధవ రెడ్డి, తెర్నేకల్లు సురేందర్‌ రెడ్డి, సాయి, రఘు, రాజా విష్ణువర్దన్‌ రెడ్డి, నరసింహులు యాదవ్, హరినాథ రెడ్డి, మద్దయ్య, రాంమోహన్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, లోక్‌నాథ్‌ యాదవ్, కటారి సురేష్, మల్లికార్జున్, వెంకటేశ్వరరెడ్డి, హరికృష్ణ, దాదామియా, రాజశేఖర్, రాఘవేంద్ర, వహీదా, విజయలక్ష్మీ, అశోక్, సాంబ, ఫరూఖ్‌సాహెబ్, జహీర్‌ అహ్మద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement