చీకటి జీవితాల్లో చిరునవ్వులు
చీకటి జీవితాల్లో చిరునవ్వులు
Published Mon, Jan 9 2017 11:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
ప్రజలకు చేరువగా రైతు భరోసా యాత్ర
- బారులు తీరిన జనంతో
నెమ్మదిస్తున్న రోడ్‌షో
- అడుగడుగునా ఆప్యాయత
పంచుతున్న జగన్
- వృద్ధులు, వికలాంగులకు
కొండంత ధైర్యం
- రెండు మండలాల్లో ఐదవ రోజు యాత్ర
- పట్టలేని ఆనందంలో రైతులు, కూలీలు
రాజన్న బిడ్డ రాక అందరి కళ్లలో ఆనందం నింపింది. ఊరు ఊరునా.. అడుగడుగునా.. కుటుంబ సభ్యున్ని చూసిన భానవ కనిపించింది. అక్కా చెల్లెమ్మలను ఆశీర్వదిస్తూ.. అన్నా తమ్ముళ్ల కష్టసుఖాలను తెలుసుకుంటూ.. ముసలవ్వల ఆవేదనను ఆలకిస్తూ.. వికలాంగులకు ధైర్యం చెబుతూ.. చీకటి నిండిన జీవితాల్లో చిరునవ్వుతో వెలుగులు నింపే ప్రయత్నం చేశారు.
ఆత్మకూరు: పొలం గట్లపై పరుగు పరుగున వచ్చే రైతు కూలీలు.. దారి పొడవునా బారులు తీరిన ప్రజలు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో సాగిన ఐదవ రోజు యాత్ర సోమవారం ఉదయం 9 గంటలకు లింగాపురం నుంచి మొదలయింది. అక్కడి నుంచి ప్రారంభమైన రోడ్‌షో బీసీ పాలెం, సింగవరం, సోమయాజులపల్లె, ఓంకారం, ఈర్నపాడు, కడమకాల్వ, వెంగళరెడ్డినగర్, బి.కోడూరు, అబ్బీపురం మీదుగా తిమ్మాపురం వరకు సాగింది. రెండు మండలాల్లో ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇక్కట్లను జనం ఏకరువు పెట్టారు. కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. రైతులు, రైతు కూలీల కష్టాలు తెలుసుకున్నారు. పింఛన్లు అందలేదని.. పక్కా గృహాలు ఇవ్వడం లేదని.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో అవస్థ. వీరందరితో జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం రావాలని భగవంతున్ని గట్టిగా కోరుకోవాలన్నారు.
అందరి కళ్లల్లో ఆప్యాయత
రాజన్న బిడ్డ రాకతో నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలు పరవశించాయి. పల్లె ప్రజల కళ్లల్లో ఆప్యాయత, అనురాగాలు వైఎస్ జగన్‌కు రెట్టించిన ఉత్సాహాన్నిచ్చాయి. నడవలేకపోయినా రోడ్డు మీదకొచ్చి నిల్చొన్న వృద్ధులను చూసి జగన్ వారి వద్దకు వెళ్లి పలకరించారు. యువత కేరింతలు కొడుతూ ఆయనతో కరచాలనం చేసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు పోటీపడటం విశేషం.
రబీకి సాగునీరివ్వాలి
రైతు భరోసా యాత్రలో భాగంగా రోడ్‌షో నిర్వహిస్తున్న జగన్‌కు రైతులు, కూలీలు తమ కష్టాలను వివరించారు. రబీకి సాగు నీరు అందించేలా చూడాలని వేడుకున్నారు. పంటకు నీరందకపోతే నష్టాలు కూరుకుపోతామని, ఇప్పటికే గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుగంగ నుంచి రెండవ పంటకు సాగునీరు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మీ ఒక్కరితోనే సాధ్యమంటూ సోమయాజులపల్లె, బి.కోడూరు, తిమ్మాపురం రైతులు అభ్యర్థించారు. అందుకు జగన్ స్పందిస్తూ వచ్చేది రైతు రాజ్యమని, ప్రాజెక్టుల కింద మూడు పంటలు పండించుకోవచ్చని ధైర్యం చెప్పి ముందుకు కదిలారు.
30 కిలోమీటర్లు పైగా యాత్ర.. 12 గంటల రోడ్‌షో
శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా యాత్ర 5వ రోజు 30 కిలోమీటర్లు పైగా 12 గంటల పాటు సాగింది. దారిపొడవునా ప్రజలు బారులు తీరి స్వాగతం పలకడంతో రోడ్‌షో నెమ్మదించింది. సింగవరం, లింగాపురం గ్రామాల మధ్య గొర్రెల కాపరులు ఎదురొచ్చి మాట్లాడించారు. వారితో జగన్ మాట్లాడుతూ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొర్రెలకు ఇన్సూరెన్స్ పథకం ఉండేదని, ప్రస్తుతం ఆ పథకం అమలవుతుందా అని ఆరా తీశారు. అందుకు వారు ఎలాంటి పథకం లేదని చెప్పారు. గొర్రెలు చనిపోతే ఎలాంటి నష్టపరిహారం అందడం లేదని, యేటా లక్షలాది రూపాయలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ మన ప్రభుత్వం వచ్చా అన్నివిధాల అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కాటసాని రామిరెడ్డి, చెరుకులపాడు నారాయణరెడ్డి, మురళీకృష్ణ, పార్టీ నేతలు కుందూరు శివారెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, యుగంధర్‌రెడ్డి, బొంతల విజయభాస్కరరెడ్డి, రాజా విష్ణువర్దన్‌రెడ్డి, రాంపుల్లయ్య యాదవ్, మల్లెల రఘురెడ్డి, ప్రసాద్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement