సైకిల్ యాత్రకు సమస్యల బ్రేక్ !
‘రోడ్లు అభివృద్ధి చేయలేదు. అధ్వానంగా ఉన్న రోడ్లపై ఇబ్బందులు పడుతున్నాం. వారానికి రెండుసార్లు వచ్చే తాగునీటితో ఎలా బతకాలి. పింఛన్ల కోసం అందజేసిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. ఇళ్ల స్థలాల పంపిణీ ఊసే లేదు. డ్రెయినేజీ లేక పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.
’ – మంత్రి కొల్లు రవీంద్ర వద్ద మచిలీపట్నంలోని 15వ వార్డు ప్రజల ఆవేదన ఇది
మచిలీపట్నం(ఈడేపల్లి) :
సైకిల్ యాత్రలో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం బందరులోని 15వ వార్డులో ఉన్న చిట్టిపిళ్లారయ్య వీధికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ప్రజలు తమ సమస్యలను ముక్తకంఠంతో చెబుతుండటంతో అసహనానికి గురైన మంత్రి కేవలం కొన్ని వీధుల్లో మాత్రమే యాత్రను నిర్వహించి వెళ్లిపోయారు.
గుడికి, మసీదుకు వెళ్లాలంటే నరకయాతనే..
చిట్టిపిళ్లారయ్య దేవస్థానానికి వెళ్లే ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా ఉందని స్థానికులు మంత్రికి చెప్పారు. చిట్టిపిళ్లారయ్య దేవస్థానానికి సమీపంలో ఉన్న మసీదుకు వెళ్లే రహదారి కూడా అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. ఈ రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీ వ్యవస్థ లేక చిన్నపాటి వర్షానికే నీరు రోడ్డుపై నిలిచిపోతుందని, దేవాలయం, మసీదుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. వారానికి రెండుసార్లు కూడా తాగునీరు సరఫరా చేయడంలేదని మహిళలు వాపోయారు. పింఛన్లు మంజూరు చేయాలని మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తంచేశారు. నివేశన స్థలాలు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడంలేదని పలువురు నిలదీశారు. రెండేళ్లుగా తమ సమస్యల గురించి చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకపోతే దలనీయబోమని మంత్రిని హెచ్చరించారు. దీంతో సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పి మంత్రి ఆ వార్డులో సైకిల్ యాత్రను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, టీడీపీ నాయకుడు గనిపిశెట్టి గోపాల్, పలువురు నాయకులు పాల్గొన్నారు.