మంగపట్నం చెరువుకు గండి
ముద్దనూరు:
మంగపట్నం గ్రామంలో చెరువుకు గండి పడింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం ధాటికి చెరువు కింద భాగంలో స్వల్పంగా గండి పడింది. దీంతో చెరవులోని నీరు క్రమక్రమంగా గండి పడిన రంధ్రం ద్వారా బయటకు ప్రవహిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారమిచ్చారు. అలాగే చెరువు ప్రధాన కట్టపై రంధ్రాలు ఏర్పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 6 నెలల క్రితమే లక్షలాది రూపాయల వ్యయంతో ఈ చెరువు కట్ట తదితర నిర్మాణ పనులు చేపట్టారు. పనులను నాణ్యతా లోపంగా చేపట్టడంతోనే గండి పడడమే గాకుండా, కట్ట బలహీనంగా తయారై రంధ్రాలు పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువును ఆర్డీవో వినాయకం, తహసీల్దారు రమ, ఎంపీడీవో మనోహర్‌రాజు, నీటి పారుదల శాఖ అధికారులు రాజగోపాల్, నాయక్ తదితరులు పరిశీలించారు.