అర్ధరాత్రి ఘాతుకం..!
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : పాకలో ఆదమరచి నిద్రిస్తున్న వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం మేడారంలో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడ్ల మారయ్య కుమారుడు అంజయ్య(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో పాటు తనకున్న గొర్లను కాసుకుంటూ అప్పుడప్పుడు ఆటో కూడా నడుపుతున్నాడు.
బుధవారం వ్యవసాయ భూమి వద్ద నుంచి గొర్లను తోలుకొచ్చి ఇంటి సమీపంలోని పాకలో తోలాడు. భోజనం చేసిన అనంతరం వాటికి కావలిగా అంజయ్య కూడా పాకలోనే నిద్రించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు గొడ్డలితో వచ్చి అంజయ్యపై దాడి చేసి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహంపై దుప్పటి కప్పి గొడ్డలిని అక్కడే వదిలి పరారయ్యారు.
వెలుగులోకి ఇలా..
గురువారం ఉదయం పాకవైపు వెళ్లిన స్థానికులకు రక్తపు మరకలు కనిపించాయి. అప్పటికీ అంజయ్య లేవకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి అక్కడికి వచ్చి పరిశీలించగా దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని సీఐ శివరాంరెడ్డి, కొండమల్లేపల్లి ఎస్‌ఐ శంకర్‌రెడ్డి పరిశీలించారు. ఘటన స్థలంలో లభించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ గొడ్డలిని అల్లుడు ముత్యాలుకు ఇచ్చానని అతడే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని మారయ్య అనుమానం వ్యక్తం చేశాడు.
మారయ్యను హత్య చేయబోయి..?
నిత్యం గొర్లకు కావలిగా పాకలో అంజయ్య తండ్రి మారయ్య పడుకునేవాడు. బుధవారం పంచాయితీ అనంతరం మారయ్య బంధువుల ఊరికి వెళ్లాడు. దీంతో అంజయ్య పాకలో నిద్రించాడు. అయితే దుండగులు పాకలో దుప్పటి కప్పుకుని నిద్రించింది.. మారయ్యే అనుకుని హతమార్చి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయితీలో జరిగిన వాగ్వాదాన్ని మనసులో పెట్టుకుని అల్లుడు ముత్యాలే హత్య చేసి ఉంటాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
గొడవే కారణమా..?
ఎడ్ల మారయ్య కుమార్తె సీత ముత్యాలమ్మను ఇదే మండలం తిరుమలగిరికి చెందిన ముత్యాలుతో 20 ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. వీరికి సంతానం కలగకపోవడంతో ఒక పాపను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ముత్యాలు వ్యవసాయం, గొర్లను సాదుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఇటీవలి కాలంలో ఎకరం భూమిని విక్రయించాడు. దీంతో పాటు సాదుకోవడానికి మామ మారయ్య ఇచ్చిన గొర్లను కూడా అమ్ముకున్నాడు.
డబ్బుల విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో మూడు మాసాల క్రితం ముత్యాలమ్మ పుట్టింటికి వచ్చింది. దంపతుల తగువును పరిష్కరించేందుకు బుధవారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పెంపుడు కుమార్తె పేరిట రూ.50 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని మారయ్య, అంజయ్య పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే ముత్యాలుకు అంజయ్య, మారయ్యకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది మనసులో పెట్టుకుని ముత్యాలు అర్ధరాత్రి వచ్చి దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మిన్నంటిన రోదనలు
దారుణ హత్యకు గురైన అంజయ్యకు భార్య ఇద్దరు కుమారులు సంతానం. ప్రస్తుతం అతడి భార్య నిండు చూలాలు. ఈ క్రమంలో భర్త హత్యకు గురవడంతో ‘‘ చంటి పిల్లలతో నేనేట్టా బతికేది దేవుడా’’ అంటూ రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శివరాంరెడ్డి తెలిపారు.