మానవత్వం మంటగలుస్తోంది. శనివారం సూర్యాపేట జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు హత్యలే దీనికి నిదర్శనం. రామలక్ష్మణుల్లా కలిసుండాల్సిన అన్నదమ్ములు చిన్న ఇంటి స్థలం విషయంలో ఘర్షణ పడ్డారు.. ఈ క్రమంలో అన్నను తమ్ముడు తన కుమారుడితో కలిసి హతమర్చాడు. మరో ఘటనలో కలకాలం కలిసుంటానని బాస చేసిన భర్త మద్యంతాగి కుటుంబాన్ని బజారు పాలు చేస్తుండగా.. మద్యం తాగొద్దు అని చెప్పిన భార్య మొడకు భర్త ఉరిపెట్టి చంపాడు. ఈ ఘటనలు జిల్లాలో సంచలనం రేకెత్తించాయి.
మద్దిరాల (తుంగతుర్తి) : కుటుంబ కలహాలతో అన్నను తమ్ముడు కడతేర్చాడు. ఈ సంఘటన మండల పరిధిలోని గోరెంట్లలో శనివారం తెల్లవారు జామున 5.30 గంటలకు చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరెంట్ల గ్రామానికి చెందిన గుండగాని సాయిలు(60), గుండగాని ఎల్లయ్య అన్నదమ్ములు. తమ్ముడు ఎల్లయ్య 25 సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం ఒంగోలు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. మూడు నెలల క్రితం గోరెంట్లకు వచ్చిన ఎల్లయ్య ఇక్కడే ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య గ్రామంలోని ఇంటి స్థలం విషయంలో అప్పుడప్పుడు ఘర్షణ జరిగేది. ఆ విషయాన్ని మనుసులో పెట్టుకున్న ఎల్లయ్య శనివారం తెల్లవారు జామున బహిర్బూమికి వెళ్తున్న సాయిలును ఎల్లయ్య అతని కొడుకు సురేష్ వారి ఇంటి వాకిలిలోకి తీసుకెళ్లి దాడి చేశారు. దీంతో సాయిలు కింద పడ్డాడు.
సాయిలు కుమారుడు నాగయ్య ఇంటి వెనుకకు వెళ్లి చూడగా సాయిలు కింద పడి ఉండడాన్ని గమనించాడు. నాగయ్యను చూసిన.. ఎల్లయ్య, సురేష్ అక్కడి నుంచి పరారయ్యారు. మృత్యువుతో పోరాడుతున్న సాయిలును చికిత్స నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షలు చేస్తుండగా.. పరిస్థితి విషమించి సాయిలు మృతిచెందాడు. సాయిలుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బలరాంనాయక్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ఎం.నాగేశ్వర్‌రావు, సీఐ.శ్రీనివాస్ సందర్శించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తుంగతుర్తి ఎస్‌ఐ బాలునాయక్ సిబ్బంది శ్రీనివాస్, వెంకటరాములు, ప్రసాద్, సైదులు, హేమంత్ తదితరులు ఉన్నారు.
నిందితుల రిమాండ్ సాయిలును హత్యచేసిన ఎల్లయ్య, అతని కొడుకు సురేష్‌ను శనివారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్‌కు తరిలిస్తున్నట్లు సిఐ.శ్రీనివాస్ తెలిపారు.
కట్టుకున్నవాడే.. కడతేర్చాడు
మఠంపల్లి (హుజూర్‌నగర్) : తాళి కట్టిన భర్తే కాలయముడయ్యాడు. నిద్రిస్తున్న భార్య మెడకు ఉరిపెట్టి కడతేర్చాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున మఠంపల్లిలోని ఎస్సీకాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లికి చెందిన కస్తాల పున్నయ్య చిన్నకుమార్తె రమణ(33)తో సూర్యాపేటకు చెందిన సూరారపు జానీకి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. జానీ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా జానీ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో రమణ ఇద్దరు కుమారులను తీసుకుని తల్లిగారి ఊరైన మఠంపల్లికి వచ్చి కూలినాలి చేసుకుని పిల్లలను పోషించుకుంటోంది. ఈ క్రమంలో జానీ తాను మద్యం తాగడం లేదని, భార్య పిల్లలతో కలిసి ఉంటానని ఆరు నెలల క్రితం మఠంపల్లికి వచ్చాడు. రమణ తండ్రి పున్నయ్య కుమార్తె కాపురం చక్కదిద్దాలనే సంకల్పంతో తన ఇంటిలోనే ఒక గదిని వారికి ఇచ్చాడు. జానీ హుజూర్‌నగర్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల జానీ తిరిగి మద్యానికి అలవాటు పడ్డాడు.
ఈ క్రమంలో ఈ నెల 13న మద్యం తాగి వచ్చిన భర్త జానీని అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రమణ ఇదేమిటని ప్రశ్నించింది. దీంతో జానీ భార్యతో గొడవపడ్డాడు. విషయం తెలిసిన తండ్రి పున్నయ్య కూతురికి, అల్లుడికి నచ్చజెప్పాడు. శనివారం తెల్లవారుజామున కూతురు ఇంటికి వెళ్లి తలుపులు తెరిచిన పున్నయ్యకు రమణ మెడకు కండువా చుట్టి ఉరి వేసి ఉండడాన్ని గమనించాడు. ఆ సమయంలో జానీ ఇంట్లోలేడు. దీంతో రమణను అల్లుడు జానీ హతమార్చి పరారయ్యాడని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కోదాడ డీఎస్పీ రమణా రెడ్డి, సీఐలు రవి, నర్సింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హుజూర్‌నగర్‌కు తరలించారు. పున్నయ్య ఫిర్యాదు మేర కు అల్లుడు జానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. తల్లి మృతదేహంపై పడి ఇద్దరు పిల్లలు రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment