గతుకుల దారిలో.. దుమ్ముగాలిలో తప్పని ప్రయాణం
గతుకుల దారిలో.. దుమ్ముగాలిలో తప్పని ప్రయాణం
Published Sun, Oct 23 2016 9:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM
రోడ్డెక్కడో.. గుంతలెక్కడో తెలియదు పాపం..
ఇది శిథిల దారి అని తెలుసూ.. అది మట్టి ధూళీ అని తెలుసూ..
ముందు వాహనం కనిపించదని తెలుసూ.. దారి పొడువునా ఇంతేనని తెలుసూ
ఇది ఉరుకుపరుగుల జీవితం.. అది అధికారుల చెలగాటం
రోడ్డు శకలమై.. ఒళ్లు హూనమై.. సాగుతున్నదొక ప్రయాణం
పట్టు జారినా.. రెప్ప మూసినా ఆగును జీవన పోరాటం..
నంద్యాల–గిద్దలూరు రహదారిపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. కర్నూలు, ప్రకాశం జిల్లాలకు రాకపోకలు సాగించే వాహనదారులకు ఈ దారే ప్రధానం. నంద్యాల నుంచి గుంటూరు, విజయవాడ తదితర ప్రధాన పట్టణాలకు కూడా ఈ దారి మీదుగానే వెళ్లాల్సిందే. నాపరాతి, ధాన్యం, గ్యాస్ సిలిండర్ల లోడ్లతో లారీలు భారీ సంఖ్యలో వెళ్తుంటాయి. ఓ వైపు ఘాట్‌రోడ్డు. మరో వైపు శిథిలమైన రహదారి. అడుగడుగునా గుంతలు. దుమ్ము చెలరేగి ఎదురెదురు వాహనాలు కనిపించని పరిస్థితి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మృత్యువు దాడి చేసే అవకాశం. గాజులపల్లె నుంచి ప్రకాశం జిల్లా వైపు సర్వనరసింహ క్షేత్రం వరకు.. ఇటు అయ్యలూరు మెట్ట వరకు పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. 30 కి.మీ. ప్రయాణం రెండు గంటల సమయం పడుతోంది. రాత్రి వేళ పరిస్థితి మరీ దారుణం. వాహనదారులకు ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
- మహానంది
Advertisement
Advertisement