బౌద్ధ బిక్షవు విగ్రహం లభ్యం
బౌద్ధ బిక్షవు విగ్రహం లభ్యం
Published Mon, Dec 5 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
ఆసక్తిగా తిలకించి, పూజలు చేసిన ప్రజలు
యానాం టౌన్ : యానాం శివారు సావిత్రినగర్ ప్రాంతంలో సముద్రపు మొగ వద్ద యానాంకు సంబంధించిన దీవి ఒడ్డున ఒక విగ్రహం లభ్యమైంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ విగ్రహాన్ని గుర్తించారు. వెదురుగెడలతో పెద్ద తెప్పలా కట్టి ఉంది. దానిపై గోపురంలా ఉన్న పందిరిలో బిక్షాపాత్రలో చెయ్యిపెట్టినట్టుగా ఉంది. గోపురం పూర్తిగా అలంకరించి, యుకే మిల్క్ పేరుతో ఉన్న డబ్బాలు తెప్పకు తీగలతో కట్టి ఉన్నాయి. ఏదో విగ్రహం సముద్రంలో కొట్టుకు వచ్చిందన్న విషయం తెలుసుకున్న సావిత్రినగర్, గిరియాంపేట తదితర గ్రామాలకు చెందిన ప్రజలు, మహిళలు, యువకులు, పిల్లలు నావలపై అధికసంఖ్యలో తరలి వెళ్లి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. దైవ విగ్రహంగా భావించి, మహిళలు, తదితరులు కొబ్బరికాయులు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ విషయం మత్స్యకార గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది.
సముద్రపు ఒడ్డున గుర్తించిన ఈ విగ్రహం ఒక బౌద్ధ బిక్షవు (మాంక్ ఇన్ బుద్ధిస్ట్)విగ్రహంగా తెలుస్తోంది. బౌద్ధ బిక్షవు మాదిరిగా బిక్షాపాత్రతో ఉంది. సింగపూర్, మలేషియా దేశాలకు చెందిన బౌద్ధబిక్షవుకు సంబంధించిన విగ్రహంగా భావిస్తున్నారు. సముద్రంలో కొట్టుకువచ్చి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. విగ్రహం ఉన్న గోపురం ««థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్ దేశాలలో బుద్ధుని ఆలయాల తరహాలో ఉంది.
Advertisement
Advertisement