పూడ్చిన శవం వెలికితీత
♦ తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కూతుళ్లు
♦ బస్వాపూర్‌లో వెలుగు చూసిన సంఘటన
ములుగు : పూడ్చిపెట్టిన మహిళ శవాన్ని పోలీసులు వెలికి తీసిన సంఘటన ములుగు మండలం బస్వాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. తమ తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె కూతుళ్లు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ములుగు పోలీసులు సోమవారం మృతదేహాన్ని తీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పదిరోజుల క్రితం జరిగిన మహిళ మృతికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చెలిమల లక్ష్మమ్మ(75) భర్త శంకరయ్య గతంలోనే మరణించడంతో కుమారుడు రాజయ్య వద్ద ఉంటోంది.
అయితే కిడ్నీలు పాడైపోవడంతో రాజయ్య గత ఆరునెలలుగా బాధ పడుతున్నాడు. వ్యాధి నయం చేయించుకునేందుకు ఇటీవల రాజయ్య తనకున్న కొద్దిపాటి భూమిని అమ్ముకోవడంతో కొద్ది మొత్తంలో డబ్బులు వచ్చాయి. ఈ డబ్బుల విషయంలో రాజయ్య చెల్లెళ్లు సుగుణ, ముత్యాలమ్మల మధ్య గొడవ జరిగింది. ఇంతలో ఏమయిందో తెలియదు కానీ ఈ నెల 19న లక్ష్మమ్మ మృతి చెందింది. దీంతో తమ తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఈ నెల 25న లక్ష్మమ్మ కుమార్తెలు సుగుణ, ముత్యాలమ్మ ఎస్పీకీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ములుగు తహశీల్దార్ శకుంతలరెడ్డి సమక్షంలో పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన డాక్టర్ బాలకృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.