చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
తొలుత పళనిస్వామి ప్రభుత్వం కరుణానిధి అంతిమ సంస్కరాలకు మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడానికి నిరాకరించిన సంగతి తెలిసింది. దాంతో స్టాలిన్, డీఎమ్‌కే వర్గాలు హై కోర్టుకు వెళ్లి మరి కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగేలా కృషి చేశారు.
హిందువు కదా.. ఖననం ఎలా
హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న పిల్లల్ని, సాధువుల్ని తప్ప మిగితా ఎవరూ మరణించిన వారిని దహనం (క్రిమేషన్) చేస్తారు. కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే ఖననం (బురియల్) చేస్తారు. కానీ కరుణానిధిని కూడా ఖననం చేశారు. ఎందుకిలా అంటే కరుణానిధి హిందూ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికి, ఆయన నాస్తికుడు. జీవించినంత కాలం ఆయన తనను తాను నాస్తికునిగానే ప్రచారం చేసుకున్నారు. అందువల్లనే కరుణానిధి అభిప్రాయాలకు విలువ ఇస్తూ ఆయనను దహనం చేయకుండా ఖననం చేశారు. ఒక కరుణానిధినే కాక గతంలో పెరియార్ ఇ.వి. రామసామి, సీఎన్ అన్నాదురై వంటి మహామహులందరిని ఖననం చేశారు. ఇప్పుడు వారి దారిలోనే కరుణానిధిని కూడా ఖననం చేశారు.
14 ఏట నుంచి నాస్తికవాదం వైపు
సమాజంలో ఉన్న బ్రాహ్మణాధిక్యాన్ని ప్రశ్నిస్తూ పెరియార్ ఇ వి రామసామి నాయకర్ ‘ద్రవిడ ఉద్యమా’న్ని తీసుకొచ్చారు. ఈ ఉద్యమ భావజాలానికి ఆకర్షితులైన కరుణానిధి దీనిలో భాగస్వామి అయ్యారు. అనంతరం ఈ ఉద్యమ ఫలితంగా ఆవిర్భవించిన ‘ద్రవిడ కళగం పార్టీ’(డీకేపీ)లో చేరారు. డీకే పార్టీలో వచ్చిన వివాదం ఫలితంగా ‘డీఎమ్‌కే’ పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ కూడా దేవున్ని నమ్మదు. అయితే కరుణా నిధి నాస్తికుడిగా ఉన్నప్పటికీ, ఇతరుల నమ్మకాలకు పూర్తి విలువనిచ్చేవారని తెలిసింది. ఆయన దేవున్ని నమ్మనప్పటికీ, ఇతరుల విశ్వాసాలను మాత్రం వ్యతిరేకించేవారు కాదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment