‘ఉప’తంత్రం | by planing | Sakshi
Sakshi News home page

‘ఉప’తంత్రం

Published Sun, Jun 18 2017 10:54 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

‘ఉప’తంత్రం - Sakshi

‘ఉప’తంత్రం

- నంద్యాల ముస్లింలకు టీడీపీ గాలం
- ఉప ఎన్నికల నేపథ్యంలో 
  21న సీఎం ఇఫ్తార్‌ విందు
- కానుకల పేరిట మభ్యపెట్టే యత్నం
- గతంలో గుర్తుకురాని ముస్లింలు
- మంత్రి మండలిలో దక్కని చోటు
- మండిపడుతున్న మైనార్టీ నాయకులు
      
నంద్యాల: మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఆ వర్గం ప్రజలకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. రంజాన్‌ తోఫా..ఇఫ్తార్‌ విందులంటూ వారిని మభ్యపెడుతున్నారు. నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో..నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ముస్లింలను ఆకర్షించేందుకు.. 21వతేదీ సాయంత్రం ఇఫ్తార్‌ విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విందుతోపాటు కానుకలను సమర్పించి ఓట్లు  దండుకోవడానికి రంగం సిద్ధం చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకోసం రూ.90లక్షలు ఖర్చు పెట్టడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును నమ్మి మోసపోవద్దని ఆవాజ్‌ కమిటీ నాయకులు..ముస్లింలకు సూచిస్తున్నారు. 
 
          టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మొత్తం 175 సీట్లలో ముస్లింలకు ఒక్కటి కూడా కేటాయించలేదు. అధికారంలో వచ్చి ప్రమాణస్వీకారం జరిగేటప్పుడు పార్టీలోని ముస్లిం నేతకు మంత్రి పదవి ఇచ్చి.. తర్వాత ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు.. ముస్లింలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దీంతో అప్పట్లో  ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రెండో దఫా జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని ముస్లిం నేతలు అశించారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేశారు. నంద్యాల పట్టణం గాంధీచౌక్‌లోనూ భారీ స్థాయిలో రాస్తారోకో నిర్వహించారు. టీడీపీపై నంద్యాల నియోజకవర్గంలోని ముస్లింలతో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. 
 
మభ్యపెట్టే యత్నం..
రాష్ట్రంలో గుంటూరు, కడప, కర్నూలులో ముస్లిం జనాభా ఎక్కువ. ఆ తర్వాత నంద్యాల నిలుస్తోంది. నియోజకవర్గంలోని 2.30 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 70వేలకుపైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లిం వ్యతిరేకత అధికంగా ఉండడంతో ఉపఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని నిఘా వర్గాలు తెల్చిచెప్పాయి. దీంతో వారిని మక్కువ చేసుకునేందుకు రంజాన్‌ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటున్నారు. మంత్రి వర్గంలో చోటు హామీని పక్కనపెట్టి ఇఫార్తర్‌ విందుతో మభ్యపెట్టడానికి సిద్ధపడ్డారు. రంజాన్‌ తోఫా బ్యాగ్‌పై వేయడానికి వక్స్‌బోర్డు, మైనార్టీ సంక్షేమ మంత్రి లేరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ఫొటోను మార్ఫింగ్‌ (మార్పు) చేసి ముస్లిం టోపీ పెట్టి మభ్యపెట్టడానికి యత్నించారు. రంజాన్‌తోఫా బ్యాగ్‌పై ముస్లిం నేత ఫొటో లేకపోవడంపై ఆ వర్గం నాయకులు మండిపడుతున్నారు. 
 
ఇంత ఖర్చా..
ఉపఎన్నికల్లో ముస్లిం ఓటర్లను మభ్యపెట్టడానికి ప్రభుత్వం రూ. 90లక్షలతో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇఫ్తార్‌ విందు ఇస్తే..  ఉప ఎన్నిక కోసమే నంద్యాలలో ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. 21వ తేదీన ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం రూ. 90లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై విమర్శలు ఉన్నాయి. 
 
రాజకీయం చేయొద్దు : జాకీర్‌, నంద్యాల కౌన్సిలర్‌ 
ముస్లింలు ఉపవాసం ముగించాక సంఘీభావంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు, పట్టణ ప్రముఖులు ఇఫ్తార్‌ విందు ఇవ్వడం ఆనవాయితీ. ముస్లింలకు మంత్రి వర్గంలో చోటు కల్పించకుండా అవమానించి చంద్రబాబు.. ఇఫ్తార్‌ రాజకీయం చేయడం దారుణం. విందుతో ముస్లింలు దాసోహం అవుతారని భావించడం సరికాదు. 
 
ఇప్తార్‌తో సమస్యలు తీరువు: ముర్తుజా, రాష్ట్ర అధ్యక్షుడు, అవాజ్‌ కమిటీ  
ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు ఇవ్వడం సంతోషమే. అయితే దీనితో సమస్యలు పరిష్కారం కావని ముస్లింలు గమనించాలి. ముస్లింలకు తప్పని సరిగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఉప ఎన్నికల్లో సీటు ఇవ్వాలి. పది శాతం రిజర్వేషన్‌ ఇచ్చి సబ్‌ప్లాన్‌ అమలు పరచాలి. ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 
 
మోసం చేయ్యడానికే : మస్తాన్‌వలీ, ముస్లిం నాయకుడు 
ఉపఎన్నిక నేపథ్యంలో ముస్లింలను మోసం చేయడానికే ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఒక్క రోజు విందుకు రూ. 90 లక్ష ఖర్చు చేయడం..రాజకీయ ప్రయోజనం కోసమే.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement