విస్తరణలో తాత్సారం | canal road widning works not done | Sakshi
Sakshi News home page

విస్తరణలో తాత్సారం

Published Wed, Aug 24 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

విస్తరణలో తాత్సారం

విస్తరణలో తాత్సారం

ముందుకు సాగని కెనాల్‌ రోడ్డు విస్తరణ పనులు
ప్రజల ప్రాణాలు పోతున్నా మూడేళ్లుగా సాగ..దీత
అధికార పార్టీ ఎంపీ కాంట్రాక్టు సంస్థ కావడంతో నోరుమెదపని స్థానిక ప్రజాప్రతినిధులు
సర్కారుకు ఒత్తిడి తేవడానికి అనపర్తి వైసీపీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి సిద్ధం
అనపర్తి (బిక్కవోలు) : గత ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రం కాకినాడ నుంచి వాణిజ్య కేంద్రం రాజమండ్రిని కలుపుతూ చేపట్టిన కెనాల్‌ రోడ్డు విస్తరణ పనులు మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. రోడ్డు అభివృద్ధి చేస్తే తమ గ్రామాలకు రాకపోకలు సులువుగా సాగుతాయని భావించిన రోడ్డు వెంబడి ఉన్న గ్రామాల వారు ఏళ్ల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మూడేళ్లలో ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోగా ఈ ఏడాది ఇప్పటికి నలుగురు మృతిచెందారు.
కెనాల్‌ రోడ్డు అభివృద్ధిలో భాగంగా కాకినాడ నుంచి వేమగిరి వరకు 56 కిలోమీటర్లు రోడ్డును ఎనిమిది నుంచి 10 మీటర్ల రోడ్డుగా అభివృద్ధి చేయడానికి, వేట్లపాలెం నుంచి కాకినాడకు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయడానికి ప్రపంచబ్యాంకు నిధులు సుమారు రూ.260 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టు చేజిక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ మూడేళ్లలో పనులు పూర్తి చేయవలసి ఉంది. నిబంధనల ప్రకారం ఈ ఏడాది అగస్టుకు పనులు పూర్తయి రోడ్డు వినియోగంలోకి రావలసి ఉంది. కాని ఇప్పటి వరకు 5 శాతం మాత్రమే పనులు జరిగాయి. రాజకీయాల్లో హేమాహేమీలుగా చెప్పకునే మూడు నియోజకవర్గాల శాసనసభ్యులు, రాష్ట్ర హోంమంత్రి నియోజకవర్గాల పరిధిలో ఉన్నప్పటికీ పనులు ముందుకుసాగడం లేదు. కాంట్రాక్టు దక్కించుకున్నది తెలుగుదేశం ఎంపీకి చెందిన కంపెనీ కావడంతో.. నిధులిచ్చిన ప్రపంచబ్యాంకు కాంట్రాక్టర్‌ను తొలగించమన్నా ప్రభుత్వం స్పందించడంలేదు. ప్రజాప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం మౌనంగా ఉంటున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 
రేపు సూర్యనారాయణరెడ్డి పాదయాత్ర
ఈ రోడ్డు పనులు పూర్తికాక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 26వ తేదీన అనపర్తి నుంచి బిక్కవోలు వరకు 12 కిలోమీటర్లు పాదయాత్రను చేపట్టనున్నారు. ఈ పాదయాత్రకు నియోజకవర్గంలోని జనం పార్టీల కతీతంగా సంఘీభావం ప్రకటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement