
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరు మృతి
మొయినాబాద్: మూల మలుపువద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్– బీజాపూర్ రహదారిపై చిన్నషాపూర్ గేటు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై నయీమొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి ప్రాంతానికి చెందిన రమేష్‌కుమార్(55) కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.
సోమవారం ఉదయం రమేష్‌కుమార్ అతని బావమరిది కొడుకు సంతోష్‌కుమార్ కలిసి ఓమిని కారులో వికారాబాద్‌కు సరుకులు తేవడానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా చిన్నషాపూర్ గేటు సమీపంలో మలుపువద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులోఉన్న రమేష్‌కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న సంతోష్‌కుమార్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన సంతోష్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. రమేష్‌కుమార్ మృతదేహం కారులో ఇరుక్కుపోవడంతో జేసీబీ, ఇటాచీల సహాయంతో బయటకు తీశారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.