కారు అద్దె రూ.2.3 లక్షలు! | Car rental of Rs .2.3 lakhs! | Sakshi
Sakshi News home page

కారు అద్దె రూ.2.3 లక్షలు!

Jul 12 2016 3:13 AM | Updated on Sep 4 2017 4:37 AM

కారు అద్దె రూ.2.3 లక్షలు!

కారు అద్దె రూ.2.3 లక్షలు!

రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ ఓఎస్‌డీ వాడుతున్న కారుకు అద్దె చెల్లించడానికి కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

* మంత్రి ఓఎస్‌డీ కారుకు అద్దె చెల్లించేందుకు కార్పొరేషన్ తీర్మానం
* ప్రతి నెలా బిల్లు చెల్లించేందుకు నిర్ణయం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి. నారాయణ ఓఎస్‌డీ వాడుతున్న కారుకు అద్దె చెల్లించడానికి కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.  ఐదు నెలలుగా బకాయి ఉన్న  రూ.2,30,800 చెల్లించేందుకు మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సోమవారంజరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. వివరాల్లోకెళితే మంత్రి నారాయణ ఓఎస్‌డీకి ప్రొటోకాల్ విభాగం ఒక వాహనం ఏర్పాటు చేసింది. కారు అద్దెను ప్రొటోకాల్ నిధుల నుంచి జిల్లా కలెక్టర్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి ప్రొటోకాల్ కింద వాహనం ఏర్పాటు చేసినందువల్ల కారుకు సంబంధించిన అద్దె మీరే చెల్లించాలని జిల్లా కలెక్టర్ మార్చి 28వ తేదీ కార్పొరేషన్ కమిషనర్‌కు లేఖ రాశారు.

ఈ కారు ప్రొటోకాల్ విభాగం ఏర్పాటు చేయాల్సి ఉన్నందువల్ల అద్దె కూడా ఆ విభాగమే చెల్లించాలని అధికారులు మూడు నెలలుగా నిధులు చెల్లించలేదు. అటు అధికారులు, ఇటు పాలక వర్గం మీద ఒత్తిడి తీవ్రం కావడంతో సోమవారం నాటి స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. నవంబరు 2015 నుంచి మార్చి 2016వరకు మంత్రి ఓఎస్‌డీ ఉపయోగించిన ఏపీ 26 ఎఎం 3389 కారు అద్దె కింద రూ.2,30,800 చెల్లించాలని స్టాండింగ్ కమిటీ అధికారులను ఆదేశించింది. ఇకపై ప్రతి నెలా ఈ కారు అద్దె కార్పొరేషన్ భరించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వివాదం నుంచి బయటపడటానికి కార్పొరేషన్ అధికారులు తాము మంత్రి ఓఎస్‌డీ కారుకు చెల్లిస్తున్న అద్దెను ప్రతి నెతా తమకు వెనక్కు ఇవ్వాలని ప్రొటోకాల్ విభాగానికి లేఖ రాయాలని నిర్ణయించారు. మంత్రి ఓఎస్‌డీ కారుకు చెల్లించిన అద్దె గోడకు కొట్టిన సున్నం మళ్లీ వెనక్కు వస్తాయా? అని కార్పొరేషన్ అధికారులే చెబుతున్నారు.
 
స్వర్ణభారత్ ట్రస్ట్‌కు 18 సెంట్ల స్థలం
రిత్విక్ లేఅవుట్‌లో కార్పొరేషన్ 18 సెంట్ల స్థలాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్‌కు అప్పగించేందుకు స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కంటి, దంత వైద్యశాలను నిర్మించి సదరు భవనాన్ని తిరిగి కార్పొరేషన్‌కు అప్పగించనున్నారు.  కాగా పైపుల్లేని శివారు ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో పైప్‌లైన్లను వేయిస్తామని మేయర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement