కులం తక్కువని గెంటేశారు..
Published Fri, Aug 19 2016 6:26 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. నిమ్న కులానికి చెందిన యువతి ఆలయం ముందు కూర్చుందని గ్రామస్థులు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేసి ఘోరంగా అవమానించారు. విధి నిర్వహణలో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగురాలని కూడా చూడకుండా.. ఆలయ ప్రాంగణంలో ఎందుకు కూర్చున్నావని అవమానించి అక్కడ నుంచి గెంటేశారు. దీంతో ప్రభుత్వోద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. దేశానికి స్వతంత్య్రం వచ్చి డైబ్భై ఏళ్లు దాటిన ఇంకా అంటరానితనం పోలేదని.. కుల వివక్ష రూపుమాపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణ సంఘటన జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం ముప్పాలకుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం ముప్పాలకుంటకు చెందిన పంచాయతి సెక్రటరీ గత కొన్ని రోజులుగా సెలవు మీద ఉండటంతో.. సమీప గ్రామమైన బైరసముద్రం సెక్రెటరీ భవానికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె రెండు గ్రామాల బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో ప్రజాసాధికారిక సర్వేలో పాల్గొనడానికి ముప్పాలకుంటకు వచ్చిన భవానికి గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో.. నల్లాలమ్మ దేవాలయం ఎదుటకు వచ్చింది. అక్కడ సిగ్నల్స్ అందుబాటులో ఉండటంతో.. ఆలయ ప్రాంగణంలోని రచ్చబండపై కూర్చొని ట్యాబ్ ద్వారా వివరాలు తీసుకుంటుండగా.. గ్రామానికి చెందిన కొందరు అక్కడికి చేరుకొని నీది ఏ కులమని ప్రశ్నించారు. అనంతరం నువ్వు అంటరానిదానివి, దళిత జాతికి చెందిన దానివి ఇక్కడ కూర్చోవద్దు అని ఘోరంగా అవమానించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Advertisement
Advertisement