
నిఘా నీడలో..!
♦ రేషన్ దుకాణాల్లో సీసీ కెమెరాలు
♦ మండలస్థాయి స్టాక్ పాయింట్లలోనూ..
♦ స్టాకు తీరు, ఇతరత్రాలపై దృష్టి
♦ పోలీస్ కమిషనరేట్ నుంచి పర్యవేక్షణ
ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలనుఅరికట్టేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఇప్పటికే మండలస్థాయి స్టాక్ పాయింట్లకు సరుకులు చేర్చే వాహనాలకు జీపీఎస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన అధికారులు.. తాజాగా ఎంఎల్‌ఎస్ పాయింట్లు, రేషన్ దుకాణాల్లో సీసీ (క్లోజ్‌డ్ సర్క్యూట్) కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఆయా గోదాములు, దుకాణాల్లో స్టాకు తీరు, ఉద్యోగుల పరిస్థితిని కనిపెట్టేందుకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడనుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 1,850 వరకు చౌకధరల దుకాణాలున్నాయి. ఇందులో సైబరాబాద్ పరిధిలో వెయ్యి వరకు ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలో లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్న సైబరాబాద్ పరిధిలోని దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అదేవిధంగా ఈ పరిధిలో ఉన్న 12 మండల స్థాయి స్టాక్ (ఎంఎల్‌ఎస్)పాయింట్లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఖర్చునంతా సైబరాబాద్ పోలీసు యంత్రాంగం భరించనుంది. అదేవిధంగా స్టేజీ 1 కాంట్రాక్టర్లు వినియోగించే వాహనాలకు జీపీఎస్‌ను అనుసంధానం చేసినప్పటికీ.. వీటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు సమాచారమందితే కాంట్రాక్టు రద్దు చేసేందుకు సైతం వెనకాడబోమని అధికారులు చెబుతున్నారు.
రెండువైపులా నిఘా..
రేషన్ దుకాణాల్లో, మండలస్థాయి స్టాక్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు వాటి పర్యవేక్షనపైనా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల సమాచారమంతా సైబరాాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఒక ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షిస్తారు. తేడా వచ్చినట్లు భావిస్తే వెంటనే పోలీసు బృందంతో దాడికి ఉపక్రమిస్తారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోనూ విజువల్స్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించారు.
రేషన్ తీసుకున్నారా.. రసీదు పొందండి
ఇకపై రేషన్ సరుకులు తీసుకునే ప్రతి లబ్ధిదారుడు డీలరు నుంచి తప్పనిసరిగా రసీదు పొందాల్సిందే. ఈ మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రతి డీలరు తప్పకుండా ఈపీఓఎస్ యంత్రాల్ని కొనుగోలు చేయాల్సిందిగా జేసీ ఆమ్రపాలి స్పష్టం చేశారు. వాటిని వినియోగించి రేషన్ సరుకులు ఇవ్వాల్సిందిగా మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన పౌరసరఫరాల శాఖ సమావేశంలో ఆమె వెల్లడించారు.