మున్సిపల్ సమావేశం రసాభాస
-
అలేఖ్య మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విధుల నిర్వహణపై నిరసన
-
సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒంటెద్దు పోకడ తగదన్న భరత్‌కుమార్
కావలి అర్బన్:
స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. అజెండాలోని అంశాలు పూర్తిగా చదవకుండానే అప్పటికప్పుడే అందులోని అంశాలను ఆమోదించి సభ నుంచి వెళ్లిపోయారు. అలేఖ్య చైర్‌పర్సన్ హోదాలో ఎందుకు వ్యవహరిస్తున్నారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.
ఒంటెడ్డు పోకడపై బీజేపీ ధ్వజం
సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒంటెద్దు పోకడకు వెళ్లడం తగదని బీజేపీ కౌన్సిలర్ గుండ్లపల్లి భరత్‌కుమార్ అన్నారు. సమావేశం 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది, భరత్‌కుమార్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, అధికారులు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 30 నిమిషాల ఆలస్యంగా టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అప్పటికే కౌన్సిలర్ అలేఖ్య మున్సిపల్ చైర్‌పర్సన్ సీట్లో కూర్చున్నారు. అజెండాలో ఉన్న 13 అంశాలను చదివి వినిపించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకట నారాయణ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కమిషనర్‌కు వినతి ప్రతం ఇచ్చేందుకు ఆయన కూర్చున్న సీటు వద్దకు వెళ్లారు. సమావేశం మందిరంలో చైర్‌పర్సన్ ఉండగా తనకు వినతిపత్రం ఇవ్వరాదని, తన చాంబర్‌లో ఇవ్వాల్సిందిగా కమిషనర్ సమాధానం ఇచ్చారు. అనంతరం పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. సమావేశాన్ని 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశానికి తిరిగి వచ్చిన అలేఖ్య అధికారులు అంశాలను చదువుతుండగానే 2, 3 అంశాలు మినహా అన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.
నిబంధనల అతిక్రమణపై నిరసన
చైర్‌పర్సన్ సీట్లో కౌన్సిలర్ పోతుగంటి అలేఖ్య కూర్చొని సమావేశం జరపడం నిబంధనలకు వ్యతిరేకమని, చైర్‌పర్సన్ పదవికి అనర్హురాలని కోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని కమిషనర్‌కు వివరించారు. ఇన్‌చార్జి చైర్ పర్సన్‌గా భరత్‌కుమార్ విధులు నిర్వహించారని గుర్తు చేశారు. కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేంత వరకు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేపట్టనివ్వద్దని వివరించారు.
పక్షపాతధోరణి తగదు
సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అధికార సభ్యులు ఒంటెద్దు పోకడకు వెళ్లడం తగదని మున్సిపల్ వైస్ చైర్మన్ గుండ్లపల్లి భరత్‌కుమార్ పేర్కొన్నారు. టీడీపీ కౌన్సిలర్లు సభ్యతగా వ్యవహరించాలని కోరారు. పట్టణాభివృద్ధిలో భాగమైన రూ.7 కోట్ల నిధులతో నిర్మించాల్సిన రోడ్లు ఎందుకు వాయిదా వేసుకున్నారో తెలియడంలేదని ఆవేదన చెందారు. అన్నపూర్ణ మార్కెట్ వ్యాపారులను దెబ్బకొట్టి దారిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉందో ఆలాగే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ కౌన్సిలర్లు పొనుగోటి అనూరాధ, కేతిరెడ్డి శ్రీలత, చేవూరి తిరుపాలు, కనపర్తి రాజశేఖర్, కుందుర్తి సునీత, సురే మదన్‌మోహన్ రెడ్డి, మాల్యాద్రి, పేరం లలితమ్మ, మొలతాటి శేషమ్మ, మంద శ్రీనివాసులు, డేగా రామయ్య, పుష్పావతి హాజరయ్యారు.