దమ్ముంటే చాపరాయి బాధితులకు ధైర్యం చెప్పు
సాక్షి, రాజమహేంద్రవరం:
సీఎం తనయుడు నారా లోకేష్‌కు దమ్ముంటే తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో నక్సలైట్స్ ప్రభావిత ప్రాంతంలోని చాపరాయి గ్రామానికి వెళ్లి అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోయిన 17 కుటుంబాలను పరామర్శించాలని మాజీ ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం నగర వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు సవాల్ విసిరారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య, సాధారణ వాహనాలు వెళ్లలేని కొండకోనల్లో ఉన్న చాపరాయి గ్రామానికి వైఎస్ జగన్ వెళ్లి వారిని పరామర్శించడం ఆయన నాయకత్వానికి ప్రతీకని ప్రశంసించారు. బుధవారం ఆయన స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడుతూ తండ్రి చాటు బిడ్డగా, ముద్ద పప్పుగా పేరుగాంచిన నారా లోకేష్, వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక పెద్దలు వెళ్లాల్సిన సభకు ఎమ్మెల్సీగా వెళ్లి దొడ్డిదారిని మంత్రి పదవి తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలతో టీడీపీ మంత్రులు, నేతల వెన్నులో వణుకుపుడుతోందని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి దంగేటి వీరబాబు కార్పొరేటర్లు మజ్జినూకరత్నం, ఈతకోటి బాపన సుధారాణి తదితరులు పాల్గొన్నారు.