రేపు జిల్లా అంతటా జగన్ జన్మదిన వేడుకలు
ఆలయాలు, చర్చిలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
వృద్ధులకు రగ్గుల పంపిణీ, సేవా కార్యక్రమాలు
వైఎస్సార్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు అనంత బాబు
కాకినాడ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి 43వ పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయ్‌భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ రోజూ ఆలయాలు, చర్చిలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా సూచన మేరకు కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రధాన ఆలయాల్లో యువజన విభాగం తరఫున పూజలు చేస్తామన్నారు. అన్నవరం సత్యనారాయణస్వామి, అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ప్రజల తరఫున పోరాడేందుకు జగన్‌కు మరింత శక్తి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, వచ్చే ఎన్నికల్లో ఆయన సీఎం కావాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని యువజన విభాగం నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
సేవ కార్యక్రమాలు
ప్రస్తుతం చలికి పేద వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాని అనంత బాబు చెప్పారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రాల్లో వారికి రగ్గులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. వీటితో పాటు ఆయా ప్రాంతాల్లోని యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పేదలు, వృద్ధులు, వికలాంగులకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.