రఫీ బీఈడీ కాలేజీలో తనిఖీలు
హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌సీఈఆర్‌టీ బృందం ఆధ్వర్యంలో రికార్డుల పరిశీలన
నిబంధనలకు విరుద్ధంగా ఒకే క్యాంపస్‌లో పలు కోర్సులు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు
వినుకొండ రూరల్: ఏసీబీకి పట్టుబడ్డ వివేకానంద విద్యాసంస్థల అధినేత రఫీకి చెందిన బీఈడీ కళాశాలలో ఎస్‌సీఈఆర్‌టీ బృందం శుక్రవారం తనిఖీలు చేపట్టింది. హైదరాబాదులో కాలేజీ యాజమాన్యాల వద్ద లంచం తీసుకుంటూ జూలై 28న రఫీ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. రఫీ నిబంధనలకు విరుద్ధంగా 21 కళాశాలలను నడుపుతున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన కాసరగడ్డ ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్ ఎన్.మాధవరావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి, విచారణకు సూచించిన నేపథ్యంలో ధర్మాసనం ఎస్‌సీఈఆర్‌టీకి దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పిన వివిధ బీఈడీ కళాశాలలను తనిఖీలు ప్రారంభించింది. శుక్రవారం వినుకొండ విఠంరాజుపల్లి సమీపంలోని వివేకానంద బీఈడీ అండ్ డీఈడీ కళాశాలలోని రికార్డులను ఎస్‌సీఈఆర్‌టీ బృందం సభ్యురాలు ప్రొఫెసర్ లక్ష్మీవాట్స్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ జరిగింది. కళాశాల సర్వే నంబరు, నిర్మాణం తీరు కొలతల ద్వారా బృందం సభ్యులు సేకరించారు. ఒకే క్యాంపస్‌లో బీఈడీ, డీఈడీ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఒకే కళాశాలలో ఇన్ని క్యాంపస్‌లు ఎలా నడుపుతున్నారంటూ యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. బీఈడీ కళాశాలకు పెద్దగా స్పందన లేకపోవడంతో వాస్తవానికి మూడు డీఈడీ, ఒక హిందీ డీఈడీ కళాశాలలు నడుపుతున్నట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రఫీ నెలకొల్పిన బీఈడీ, డీఈడీ కళాశాలలను తనిఖీ చేస్తున్నామని, సేకరించిన వివరాలను త్వరలో హైకోర్టుకు అందజేస్తామని లక్ష్మీవాట్స్ తెలిపారు. ఆమె వెంట డిప్యూటీ డీఈవో రామారావు, వినుకొండ ఎంఈవో జఫ్రల్లా, వినుకొండ సర్వే బృందంతో పాటు ఎస్‌సీఈఆర్‌టీ సర్వే బృందం ఉన్నారు.