బట్టీల్లో బాల్యం
♦ బుగ్గి అవుతున్న భవిష్యత్తు
♦ పెద్దలతో పాటే పిల్లలూ పనుల్లో..
♦ యథేచ్ఛగా ఇటుక బట్టీల నిర్వహణ
♦ చోద్యం చూస్తున్న అధికారులు
♦ యథేచ్ఛగా విద్యుత్ వినియోగం
మెదక్ : ఇటుక బట్టీల్లో బాల్యం బుగ్గి అవుతోంది. బాలల హక్కుల చట్టం ప్రకారం వారిని కాపాడి, ఇటుక బట్టీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన కార్మికశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇటుక బట్టీల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. జిలాల్లో వందలాది ఇటుక బట్టీలు వెలిశాయి. ఈ బట్టీల్లో వేలాది మంది బాలకార్మికులలు పనులు చేస్తున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పనులు చేయిస్తుంటారు. దీంతో కార్మికులతో పాటు వారిపిల్లలు సైతం బట్టీల్లో పనులు చేయాల్సిందే. ఇంత తతంగం అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా, పట్టించుకున్న పాపానపోవటంలేదు. అంతేకాకుండా రైతాంగం అబివృద్ధి కోసం ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇస్తే దాన్ని సైతం బట్టీలకు వాడుకుంటూ ట్రాన్స్‌కోను నిలువునా ముంచుతున్నారు. కలపను విచ్చలవిడిగా బట్టీలకింద కాల్చటం, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వ్యవసాయపొలాల్లో బట్టీలు నిర్వహిస్తూ వాల్టాచట్టానికి తూట్లు పొడుస్తున్నారు.
ఈ బట్టీలను రోడ్లపక్కనే ఏర్పాటు చేస్తుండటంతో వాహనదారులు కళ్లలో దుమ్ముధూళిపడి అనేక ఇబందులు పడుతున్నారు. తరుచూరోడ్డు ప్రమాదాలకు గురికావల్సి వస్తోంది. బట్టీలను నిర్వహించాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరి. ఇందుకోసం కొంత డబ్బును చలాన్‌రూపంలో చెల్లించాలి. అలాగే నీటిని వాడుకోవటానికి విద్యుత్తు శాఖకు రూ. 10వేల డిడిని చెల్లించాలి. బట్టీల కిందకు కలపను ఎక్కడినుండి సమకూర్చుకునే విషయమై ముందుగానే ఫారెస్టుఅధికారుల అనుమతులు తీసుకోవాలి.
ముఖ్యంగా బట్టీల్లో 14 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకోకూడదు. ఇన్నిరకాల అనుమతులు పొందాకనే బట్టీలను నిర్వహించాలి. కానీ జిల్లాలో నిర్వహించిన వందలాది బట్టీల్లో ఎక్కువశాతం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అధికారులకు ముడుపులు ముట్టజెప్పి నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మెదక్ మండలంలో గంగాపూర్, తొడిట, పిల్లికొటాల్, హవేళిఘణపూర్, శివారుల్లో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల్లో వందలాది మంది బాలకార్మికులు పనులు చేస్తున్నారు. వీరి కోసమైనా ప్రత్యేకం గా బడులు ప్రారంభించాల్సి ఉంది.
అధికారి వివరణ: ఈ విషయంపై ఎంఈఓ నరేష్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
రోజుకు రూ.400 నుంచి 500 సంపాదిస్తున్నాం
మాది మహరాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం. నెల క్రితం ఇటుకలు చేసేందుకు మెదక్ మండలం రాయిన్‌చెర్వు గ్రామానికి భార్యపిల్లలను వెంటతీసుకొని వచ్చాం. రోజుకు సుమారు 1000 ఇటుకలు తయారు చేస్తున్నాం. ఇందుకు మాకు రూ.400 నుండి 500ల వరకు వస్తుంది - దశరథం, నాందేడ్.
పనిచేసేచోట బడులు లేవు
పొట్ట చేతబట్టుకొని రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చాం. ఇక్కడ పనిచేసేచోట పాఠశాలలు ఏర్పాటుచేసి మాలాంటి వారి పిల్లలకు చదువులు చెప్పిస్తారట. కాని ఇక్కడ అలాంటివేవి అందుబాటులోలేవు. మా పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. - లక్ష్మణ్, నాందేడ్
మా రాష్ట్రంలో పని దొరకడంలేదు..
మా సొంతరాష్ట్రంలో ఏం పనులు దొరకడం లేదు. దీంతో ఇక్కడకు వచ్చాం. పనిచేసేచోటనే చిన్నపాటి గుడిసెలు వేసుకొని పనులు చేస్తున్నాము. నాతోపాటు నాభర్త, పిల్లలు ఉన్నారు. - శ్యామ్‌బాయి, నాందేడ్