‘రాజధాని’ ఉద్యోగుల పిల్లల చదువులెలా?
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రభుత్వ పంతం ఉద్యోగులకు కొత్త అవస్థలు తెచ్చిపెడుతోంది. హైదరాబాద్‌లోని ఏపీ ఉద్యోగులందరూ జూన్ 27 నాటికి అమరావతికి తరలిరావాలంటూ సర్కారు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం కార్యకలాపాలను త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా అమరావతికి ఉద్యోగుల తరలింపులో మరో మెలిక పడింది. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చే ఉద్యోగులకు తమ పిల్లల చదువులు పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటికే పలు కాలేజీల్లో చదువు మధ్యలో ఉన్న పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. విజయవాడ, గుంటూరు నగరాల్లోని విద్యాసంస్థల్లో చేర్పిద్దామనుకుంటే ఇక్కడ సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది.
ఆలస్యంగా వస్తే అడ్మిషన్లు దొరకవు
తొలి దశలో అమరావతికి తరలివచ్చే రెండు వేల మంది ఉద్యోగులకు సంబంధించి 200 మంది పిల్లలకు పాఠశాలల్లో, 400 మందికి కళాశాలల్లో సీట్లు కావాలి. ఉద్యోగులు కచ్చితంగా జూన్ 27 నాటికి అమరావతికి రావాలనే ప్రభుత్వ నిర్ణయంతో పిల్లల చదువులు డోలాయమానంలో పడ్డాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 13 నుంచి విద్యా సంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. ఉద్యోగులు అమరావతికి రావాలంటే జూన్ నెలాఖరు వరకు ఆగాల్సి ఉంటుంది. అమరావతికి వచ్చాకే పిల్లల అడ్మిషన్ల విషయం చూద్దామంటే పిల్లలు 15 రోజులపాటు చదువులు కోల్పోవడంతోపాటు అసలు సీట్లు దొరకని పరిస్థితి ఉంటుంది. పోనీ ముందుగా వచ్చి తమ పిల్లలకు సీట్ల కోసం ప్రయత్నాలు చేద్దామంటే రాజధానికి వెళ్లే ముందు వారం, పది రోజులు సెలవులు దొరికే పరిస్థితి లేదని ఒక ఉద్యోగి తెలిపారు. మొత్తానికి పిల్లల చదువులు ఉద్యోగులను సంకట స్థితిలోకి నెట్టేస్తున్నాయి.
సీఎం ఆదేశాల అమలేదీ?
తాత్కాలిక సచివాలయ ఉద్యోగుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో సీట్లు, ఫీజులు తదితర విషయాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు జారీ చేసిన ఆదేశాల అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగి కూడా తమ పిల్లలకు కాలేజీ, పాఠశాలలో సీటు కావాలని నేరుగా విద్యాశాఖ అధికారులను సంప్రదించలేదని సమాచారం. సచివాలయ ఉద్యోగుల పిల్లలకు ఏ కాలేజీలో, ఏ పాఠశాలో సీట్లు కావాలనే ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సేకరించలేదు. రాజధానికి తరలివచ్చే ఉద్యోగుల సంఖ్య, వారి పిల్లల అడ్మిషన్ల విషయంలో జూన్ నెలాఖరు నాటికి స్పష్టత వస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
సమస్యలున్నాయ్.. అయినా రాక తప్పదు
‘‘ఏపీ, తెలంగాణ లో విధులు నిర్వహిస్తున్న భార్యభర్తలకు ఆప్షన్లు లేకపోవడం, పిల్లల చదువులతోపాటు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఉద్యోగులు అమరావతికి తరలిరాక తప్పదు. తొలి దశలో రెండు వేల మంది ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది. వివిధ దశల్లో మొత్తం పది వేల మంది ఉద్యోగులు అమరావతిలోని సచివాలయ విధులకు వచ్చినప్పటికీ వారిలో ఆరు వేల మంది అనేక ఇబ్బందులతో హైదరాబాద్‌లోనే మకాం ఉండే పరిస్థితి ఉంది. మరో మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు తీరుతాయని అనుకుంటున్నాం’’
- మురళీకృష్ణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు