
త్వరలో 'అనంత'లో సినిమా షూటింగ్!
అనంతపురం ఎడ్యుకేషన్ : విక్టరీ వెంకటేష్, యువ హీరో దగ్గుబాటి రానా కథానాయకులుగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్‌కు ‘అనంత’ వేదిక కానుంది. ఇందుకోసం మూడు రోజుల కిందట స్వయంగా డైరెక్టర్ తేజ అనంతపురం వచ్చి కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు శత వసంతాల చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాలను పరిశీలించారు. ఆర్ట్స్ కళాశాలలో షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలని ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామిని కోరారు.
సెలవు దినాల్లో షూటింగ్ పెట్టుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. అయితే ముందుగా అనుమతి లేఖ ఇస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆమోదం తీసుకుంటామన్నారు. దీనిపై ప్రిన్సిపల్ రంగస్వామి 'సాక్షి'తో మాట్లాడుతూ డైరెక్టర్ తేజ వచ్చి కళాశాలను సందర్శించారన్నారు. త్వరలోనే షూటింగ్ ఏర్పాటుకు అనుమతులు కోరుతూ లేఖ పంపుతామని చెప్పారన్నారు.