
ఏరివేత కొలిక్కి!
♦ నెలాఖరులోగా రెండు కార్డులున్న వారి జాబితా రెడీ డేటాబేస్ ఆధారంగా నిర్ధారణ
♦ తొలగింపు ఇక్కడినుంచే ఆగస్టులో కొత్త రేషన్ కార్డులు!
రేషన్ కార్డుల్లో అక్రమార్కులపై సర్కారు కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు, వారిపై ఆధారపడినవారు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికిచ్చిన రేషన్ కార్డులను తొలగించిన పౌరసరఫరాల శాఖ.. తాజాగా డూప్లికేట్లపై దృష్టి సారించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో కార్డులున్నవారి తొలగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండు రాష్ట్రాల్లో కార్డులున్నవారు స్వచ్ఛందంగా కార్డులు సరెండర్ చేయాలని గతంలో స్పష్టం చేసింది. కానీ అప్పట్లో స్పందన కరువు కావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా ఆగస్టు నెలాఖరునుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్న సర్కారు.. నకిలీలను ఏరివేసిన తర్వాత కొత్తవి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో1953 రేషన్ దుకాణాల పరిధిలో 11.69 లక్షల ఆహార భద్రత కార్డులున్నాయి. వీరికి నెలకు 24,677.41 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కిలో బియ్యం రూపాయికే ఇస్తుండడం.. అందుకు సంబంధించి రాయితీ ప్రభుత్వం భరిస్తున్న నేపథ్యంలో నకిలీ కార్డుదారులతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతోంది. ఈక్రమంలో వాటిని అరిక డితే కొత్తవాటిని ఇవ్వడం సులభతరం కావడంతోపాటు ఖజానాకు కలిసొస్తుంది. దీంతో పౌరసరఫరాల శాఖకు చర్యలు మొదలుపెట్టింది.
డ్యూయల్ కార్డులు 28వేలు..
పౌరసరఫరాల నిబంధన ప్రకారం ఒక వ్యక్తి/ కుటుంబానికి ఒక కార్డు మాత్రమే ఉండాలి. రాష్ట్ర విభజన తర్వాత కొందరు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు చోట్ల కార్డులు పొందారు. రెండువైపులా లబ్ధిపొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల పౌరసరఫరాల శాఖలు ఒప్పందానికి వస్తే తొలగింపు సులభతరం కానుంది. దీంతో ఇటీవల ఇరు రాష్ట్రాల శాఖలు సమావేశమై ఆధార్ కార్డుల అనుసంధానానికి సంబంధించి సమాచారాన్ని తీసుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
అక్కడి సమాచారాన్ని రాష్ట్ర సమాచారాన్ని సరిపోలుస్తూ డేటాబేస్‌లో సెర్చ్ చేస్తే డ్యూయల్ కార్డుల భాగోతం బయటపడనుంది. జిల్లాలో నగర శివారు ప్రాంతాలు, జీహెచ్‌ఎంసీలోని మండలాల్లో డ్యూయల్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. పౌరసరఫరాల శాఖ గణాంకాల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 28వేల కార్డులు డ్యూయల్‌గా ఉన్నట్లు అంచనా. తాజాగా కొత్త కార్డులు జారీ చేసేనాటికి వీటిపై అనర్హత వేటు వేయడం ఖాయమని అధికారవర్గాలు చెబుతున్నాయి.