నరసాపురం : భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లావాసులు ఎండల్ని తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. బయటకు రావడానికి భయపడుతున్నారు. అత్యవసర పనులపై రోడ్డెక్కుతున్న వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి జిల్లాలో మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ
అధికారులు చెబుతున్నారు. ఈనెల 28వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ అది తాత్కాలికమేనని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. నైరుతి రుతు పవనాలు సమీపించే వరకూ పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పలేమంటున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడడక్కడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నప్పటికీ.. మరో వారం రోజులపాటు వేడిగాలుల తీవ్రత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
మూడేళ్లలో ఎప్పుడూ లేదు
ఈ ఏడాది ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. మన జిల్లాపై దీని తీవ్రత ఈ ఏడాది మరింత ఎక్కువైంది. జిల్లాలో ఇప్పటికే మూడేళ్లలో ఎన్నడూలేనంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 20 రోజుల్లో అత్యధికంగా 47 డిగ్రీలు, అత్యల్పంగా 29 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 రోజుల నుంచి సగటున 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత ఏడాది మే నెలలో ఇన్ని రోజులపాటు, ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు లేవు. అప్పట్లో వేసవి సీజన్ మొత్తం తీసుకుంటే 40–47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు 11 రోజుల పాటే నమోదైనట్టు వాతావరణ శాఖ చెబుతోంది. 2014, 2015 సంవత్సరాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి. మొత్తంగా ఈ ఏడాది ఎండలు జిల్లా వాసులను మాడ్చేస్తున్నాయి. ఇప్పటికే వడదెబ్బకు గురై జిల్లాలో 50 మందికి పైగా మృతి చెందారు. ఇదిలావుండగా.. నైరుతి రుతుపవనాలు అండమాన్ ద్పీపాన్ని తాకాయి. ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు మన జిల్లా వరకు వచ్చి.. నేల పూర్తిస్థాయిలో చల్లబడాలంటే జూన్ 10–15 తేదీల వరకు ఆగాలి్సందేనంటున్నారు.
పెరిగిన తేమ శాతం
వాతావరణంలో 20 రోజులుగా భారీ మార్పులు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమశాతం 65–70 మధ్య నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు కూడా 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలను వడగాడ్పు, ఉక్కబోత ఇబ్బంది పెడుతున్నాయి. అనేకమంది డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు. గాలిలో తేమశాతం తగ్గి.. ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనా ఇబ్బందిగానే ఉంటుందని చెబుతున్నారు. అలాంటప్పుడు చెమటలు తక్కువగా పట్టి వడగాడ్పు తీవ్రత పెరుగుతుంది. ఈ నెలలో 19, 20, 21 తేదీల్లో జిల్లా ప్రజలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. రాత్రి పూట కూడా గాలిలో తేమశాతం 75–85 మధ్య ఉంటోంది. దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. దీంతో రాత్రి వేళ ప్రజలు ఉక్కబోతకు గురై నీరసించి కంటిమీద కునుకులేకుండా ఇబ్బందులు పడుతున్నారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
పెరిగిన ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభా వం చూపుతాయని నరసాపురం పట్టణానికి చెందిన వైద్యుడు డాక్టర్ బళ్ల మురళి చెప్పారు. చెమట, ఉక్కబోతతో కూడిన వేడి గాలుల ప్రభావం వల్ల ఆస్త్మా రోగులు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వడగాడ్పుల బారిన పడితే వయసు, వ్యాధులతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తాయన్నారు
ఉక్కబోత ఎక్కువ
పగటిపూట గాలిలో తేమశాతం పెరగడం వల్ల ఉక్కబోత ఎక్కువైంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ కావచ్చు. తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే వడగాడ్పుల తీవ్రత పెరుగుతుంది. ఏదేమైనా మరో వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇదేవిధంగా కొనసాగే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో అల్పపీడనాలకూ ఆస్కారం కనిపిస్తోంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా కొద్దిపాటి వర్షాలు పడొచ్చు. ఏదేమైనా ఎండల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే.. ఈనెల 31 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయంటున్నారు.
– ఎ.నరసింహరావు, వాతావరణ శాఖ అధికారి, నరసాపురం