బాబు సొంతూరులో అధికారులకు చుక్కెదురు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో అధికారులకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి బంధువే అధికారులను నిలదీశారు.
జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారులు నారావారిపల్లికి వెళ్లారు. సీఎం సమీప బంధువు నాగరాజు నాయుడు తనకు రుణమాఫీ కాలేదని అధికారులను నిలదీశారు. 40 వేల రూపాయలు అప్పు ఉంటే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని ఏకరవు పెట్టారు. ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు సొంత ఊర్లో, సమీప బంధువుకే రుణమాఫీ కాకపోవడం గమనార్హం.