11మంది చనిపోయారనగానే బాబు ఘాట్ విడిచారు
హైదరాబాద్: తొక్కిసలాట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడ ఉన్నారని స్పష్టమైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ జిల్లా ఎస్పీ చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని వెలువరించింది. ఘటన జరిగిన వెంటనే నలుగురు చనిపోయినట్లు ఎస్పీ తొలుత చెప్పినప్పుడు చంద్రబాబు అక్కడే ఉన్నారని, పదకొండు మంది చనిపోయారని చెప్పిన తర్వాత మాత్రం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారని ఎస్పీ చెప్పినట్లు పత్రిక వెల్లడించింది.
పుష్కర ఘాట్ వద్ద చేసిన ఏర్పాట్లలో లోపాలున్నట్లు కూడా ఎస్పీ తెలిపారని కథనం వెలువరించింది. బారికేడ్లు తొక్కిసలాటను నివారించలేకపోయాయని ఆ పత్రికతో ఎస్పీ చెప్పారు. ముఖ్యమంత్రి ఉదయం 6.26 నిమిషాల సుముహుర్తానికి పుష్కరస్నానం చేశారని భక్తులందరికీ తెలుసని, అదే సమయంలో స్నానం చేయాలని భక్తులు కుప్పలుగా వచ్చారని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ స్పష్టం చేసినట్లు ఆంగ్ల పత్రిక వెలువరించింది.