స్పిల్‌వే పనులు పరిశీలించిన సీఎం
మధ్యాహ్నం 12 గంటలకు రాక
పనుల ప్రగతిని వివరించిన ఈఎన్‌సీ
అధికారులతో సమీక్షించిన చంద్రబాబు
పోలవరం రూరల్:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలీకాప్టర్‌లో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వాగతం పలికారు. వ్యూపాయింట్ నుంచి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పనుల వివరాలను సీఎంకు తెలియజేశారు. అక్కడ నుంచి స్పిల్‌వే నిర్మాణ ప్రాంతానికి చేరుకుని పనులు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన మ్యాప్ ద్వారా ఈఎన్‌సీ స్పిల్‌వే వివరాలను తెలియజేశారు. అలాగే గేట్లు తయారీ కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు ఏజెన్సీ ప్రతినిధులతో పనులపై రివ్యూ జరిపారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, కార్తీకేయ మిశ్రా, డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబులు పాల్గొన్నారు.