
ఏ విధంగా దెబ్బలు తగిలాయో యాక్సిడెంట్ రిజిష్టర్‌లో పొందుపరచని దృశ్యం
‘ఎంపీపైనే కేసు పెడతావా.. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అంటూ బాధితుడిని పోట్లదుర్తికి చెందిన ఓ నాయకుడు బెదిరించినట్లు సమాచారం.
ప్రొద్దుటూరు టౌన్/ఎర్రగుంట్ల: రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దాడిలో గాయపడిన అసిస్టెంట్ లైన్‌మెన్ దండు వీరశేఖర్ ప్రొద్దుటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆదివారం రాత్రి పోట్లదుర్తి నాయకులు అక్కడికి వచ్చి అతన్ని బెదిరించి కేసు పెట్టకుండా చేశారు. ‘ఎంపీపైనే కేసు పెడతావా.. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది’ అంటూ పోట్లదుర్తికి చెందిన ఓ నాయకుడు బాధితుడిని, అతని కుటుంబ సభ్యులను బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆర్థో –2 వార్డులో చికిత్స పొందుతున్న బాధితుడు.. ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాను చెట్టు కొమ్మపై నుంచి కింద పడినందున గాయమైందని చెప్పడం చూస్తుంటే అతను ఏమేరకు ఒత్తిడికి గురయ్యాడో స్పష్టమవుతోంది.
చెట్టు కొమ్మలు కొట్టేశారని ఎంపీ సీఎం రమేష్.. అసిస్టెంట్ లైన్‌మెన్ దండు వీరశేఖర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. దాడికి గురైన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు జిల్లా ఆస్పత్రి యాక్సిడెంట్ రిజిష్టర్‌లో వైద్యులు దండు వీరశేఖర్ గాయాలను నమోదు చేశారు. ఎవరు దాడి చేశారో పేరు రాయకుండా చాకచక్యంగా వ్యవహరించారు. వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తిలోని సత్యనారాయణ కాలనీలో జరిగిన ప్రమాదంలో ముక్కుపై దెబ్బ తగిలిందని, కమిలిన గాయమైందని పుట్టు మచ్చలను రాసిన వైద్యులు బాధితుడు చెప్పిన రాజ్యసభ సభ్యుని పేరు రాయలేదు. బాధితుడు చెప్పిన విధంగా సంఘటన జరిగిన విషయాన్ని యాక్సిడెంట్ రిజిష్టర్‌లో రాయాల్సి ఉందని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.
కాగా, బాధితుని భార్య తన భర్తను పోట్లదుర్తి నుంచి బదిలీ చేయించాలని వేడుకోవడంతో నాయకులు ఆ మేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అధికార పార్టీ నాయకులు విద్యుత్‌శాఖ డీఈ విజయన్‌తో మాట్లాడించి వీరశేఖర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దాడి విషయమై డీఈ విజయన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా తాను ఆదివారం రాత్రి వీరశేఖర్‌ను జిల్లా ఆస్పత్రిలో పరామర్శించానన్నారు. తనపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. తనపై దాడి జరిగినట్లు వీరశేఖర్ ఫిర్యాదు చేయలేదని ఎర్రగుంట్ల సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.